Saudi Arabia: తెలంగాణ యువకుడ్ని తెలివిగా కటకటాల వెనక్కి పంపిన సౌదీ మామ!

  • ఉపాధి కోసం సౌదీ వెళ్లిన నిర్మల్ యువకుడు
  • యజమాని కుమార్తెతో ప్రేమ వ్యవహారం
  • ప్రియుడ్ని వెదుక్కుంటూ తెలంగాణ వచ్చిన సౌదీ అమ్మాయి

ఈ ఉదంతం ఓ సినిమా కథను తలపిస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు. తెలంగాణలోని నిర్మల్ కు చెందిన 30 ఏళ్ల షేక్ అజీమ్ ఓ కారు డ్రైవర్. అరబ్ దేశాల్లో మరింత డబ్బు వస్తుందన్న ఉద్దేశంతో 2018లో సౌదీ అరేబియా వెళ్లి ఓ ధనవంతుడి వద్ద కారు డ్రైవర్ గా చేరాడు. ఆ సౌదీ షేక్ కు రజా అనే కుమార్తె ఉంది. ఆమె వయసు 27 ఏళ్లు. అప్పుడప్పుడు ఆమెను కూడా కారులో బయటికి తీసుకెళ్లాల్సి వచ్చేది. ఆ విధంగా అజీమ్, రజాల మధ్య స్నేహం పెరిగి, అది ప్రేమగా మారింది. అయితే, తాను పనిచేస్తున్న షేక్ కు ఈ విషయం తెలిస్తే చంపేస్తాడని భయపడిన అజీమ్ చెప్పాపెట్టకుండా పారిపోయి స్వదేశానికి చేరుకున్నాడు.

కానీ, రజాలో అతడిపై ఉన్న ప్రేమ దేశాలు దాటి వచ్చేలా చేసింది. స్టడీ టూర్ వెళుతున్నానని తండ్రికి చెప్పి సౌదీ దౌత్యకార్యాలయంలో అజీమ్ చిరునామా వివరాలు తెలుసుకుంది. నేరుగా తెలంగాణలో అజీమ్ ఉంటున్న ప్రదేశానికి వచ్చింది. తన కోసం రజా అందరినీ విడిచి రావడంతో అజీమ్ కూడా ఆమెతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. దానికి అతడికి కుటుంబసభ్యులు కూడా ఒప్పుకోవడంతో వివాహం జరిగింది. ఈ విషయం తెలిసిన రజా తండ్రి ఢిల్లీలో సౌదీ ఎంబసీకి ఫిర్యాదు చేయగా, వారు తమవంతు ప్రయత్నాలు చేశారు.

అయితే తాను మేజర్ నంటూ రజా భర్త వద్దే ఉండిపోతానని కరాఖండీగా చెప్పేసింది. దాంతో బుర్రకు పదునుపెట్టిన ఆ సౌదీ షేక్, కుమార్తె గర్భం దాల్చిన నేపథ్యంలో లాంఛనాలు నిర్వహించాలంటూ అల్లుడు అజీమ్ తో తియ్యగా మాట్లాడి బుట్టలో వేసుకున్నాడు. మామ ఆప్యాయతకు కరిగిపోయిన అజీమ్ భార్య రజాతో కలిసి సౌదీ చేరుకున్నాడు. కానీ, అప్పటికే కాచుకుని ఉన్న పోలీసులు విమానాశ్రయంలోనే అజీమ్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

సౌదీలో తండ్రి అనుమతి లేకుండా కుమార్తె పెళ్లిచేసుకోవడం నేరం. ఈ కారణంగానే సౌదీ షేక్ తన అల్లుడ్ని తెలివిగా ఇరికించేశాడు. ప్రస్తుతం అజీమ్ జైల్లో ఉంటూ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నాడు. తనను కాపాడాలంటూ మొరపెట్టుకున్నాడు. ఓవైపు రజా బిడ్డకు జన్మనిచ్చింది. కనీసం కన్నబిడ్డను చూసుకునే భాగ్యం లేనందుకు అజీమ్ కన్నీటిపర్యంతమవుతున్నాడు.

  • Loading...

More Telugu News