Maharashtra: 5 నెలల క్రితమే హెచ్చరించారు.. పెడచెవిన పెట్టిన ఫలితం 15 మంది ప్రాణాలు!
- గోడ బలహీనంగా ఉందని ఫిబ్రవరిలోనే హెచ్చరించిన సొసైటీ
- దానికొచ్చిన ప్రమాదమేమీ లేదన్న బిల్డర్
- శిక్షించదగిన హత్యానేరం కింద కేసు నమోదు
పూణేలో శనివారం తెల్లవారుజామున గోడ కూలిన ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ గోడ ప్రమాదకరంగా ఉందని ఐదు నెలల క్రితమే హౌసింగ్ సొసైటీ బిల్డర్‌ను హెచ్చరించినా ఆయన పెడచెవిన పెట్టాడని అల్కాన్ స్టైలస్ సొసైటీ నివాసులు ఆరోపించారు. పెండింగ్ పనుల విషయమై ఫిబ్రవరి 16న అల్కాన్ ల్యాండ్ మార్క్స్ భాగస్వామి అయిన వివేక్ అగర్వాల్‌తో సమావేశమయ్యాయని సొసైటీ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా గోడ ప్రమాదకరంగా ఉందని, నాణ్యత ఏమంత బాగోలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను డెవలపర్‌కు ఈ-మెయిల్ ద్వారా పంపినట్టు తెలిపారు. అయితే, గోడకు వచ్చిన ప్రమాదమేమీ లేదని, పటిష్టంగానే ఉందని అల్కాన్ ల్యాండ్‌మార్క్స్ డైరెక్టర్ జగదీశ్ అగర్వాల్ చెప్పారని గుర్తు చేశారు. ఏదైనా జరిగితే తాను బాధ్యత వహిస్తానని కూడా తమతో చెప్పాడని పేర్కొన్నారు.
గోడకూలి 15 మంది దుర్మరణం పాలయ్యాక బిల్డర్‌తో జరిపిన ఈ-మెయిల్ సంభాషణలను పూణే మునిసిపల్ కార్పొరేషన్‌కు, పోలీసులకు పంపినట్టు వివరించారు. గోడకూలి 15 మంది మృతి చెందిన ఘటనలో శిక్షించ దగిన హత్యా నేరం కింద అల్కాన్ ల్యాండ్‌మార్క్స్‌కు చెందిన జగదీశ్ ప్రసాద్ అగర్వాల్ (64), సచిన్ అగర్వాల్ (34), రాజేశ్ అగర్వాల్ (37), వివేక్ అగర్వాల్ (21), విపుల్ అగర్వాల్ (21)లతోపాటు తవ్వకం పనులు చేపడుతున్న కంచన్ రాయల్ ఎగ్జోటికా ప్రాజెక్టుకు చెందిన పంకజ్ వోరా, సురేశ్ షా, రష్మీకాంత్ గాంధీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
తవ్వకం పనుల వల్ల పునాది బలహీనపడి గోడ కూలి ఉంటుందని భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.