KCR: తెలంగాణతో యుద్ధం ఎప్పుడు చేయాలో జగన్ కు బాగా తెలుసు: విజయసాయిరెడ్డి
- కేసీఆర్ తో చంద్రబాబు ఘర్షణ వైఖరి
- మేమూ అదే పని చేయాలా?
- కేశినేని మారాలన్న విజయసాయి
చంద్రబాబునాయుడు కేసీఆర్ తో ఘర్షణ వైఖరిని అవలంభించినంత మాత్రాన జగన్ కూడా అదే పని చేయాలా? అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. నిన్న టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, ఎప్పుడు యుద్ధం చేయాలో తమ సీఎంకు తెలుసునని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "కేశినాని గారూ ఇకనైనా మారండి. మీ అధినేత బీజేపీని సమర్థిస్తే అందరూ జై కొట్టాలి. యూ-టర్ను తీసుకుని కాంగ్రెస్ గుంపులో చేరితే అది గొప్ప నిర్ణయమనాలి. తెలంగాణ సీఎంతో ఘర్షణ వైఖరి అవలంబిస్తే మేమూ అదే చేయాలా? యుద్ధం ఎప్పుడు చేయాలో, సామరస్యంగా ఎప్పుడు మెలగాలో మా సీఎం గారికి తెలుసు" అని వ్యాఖ్యానించారు.
అంతకుముందు మాజీ మంత్రి దేవినేని ఉమను ఆయన టార్గెట్ చేసుకున్నారు. "బహుదా-వంశధార-నాగావళి లింక్ పనులను ఐదేళ్లలో మీరెందుకు పూర్తి చేయలేక పోయారు ఉమా? వనరుల దోపిడీకి తప్ప ఉత్తరాంధ్రను మీరు పట్టించుకున్నదెపుడు? ఏటా వృథాగా సముద్రంలో కలుస్తున్న 3,500 టీఎంసీల గోదావరి నీటితో ప్రతి ఎకరాకు జలాభిషేకం చేస్తారు సీఎం జగన్ గారు" అని అన్నారు.