Gandhi: మోడ్రన్ దుస్తుల్లో ఉన్న గాంధీ చిత్రాన్ని మద్యం సీసాలపై ముద్రించిన ఇజ్రాయెల్ కంపెనీ
- మకా బ్రూవరీ సంస్థ అవమానకర చర్య
- మోదీ, నెతన్యాహులకు లేఖ రాసిన మహాత్మాగాంధీ జాతీయ సంస్థ చైర్మన్
- చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి
భారతీయ దేవుళ్లను కించపరిచేలా పాశ్చాత్య కంపెనీలు అనేక అనుచిత చర్యలకు పాల్పడడం గతంలో జరిగింది. తాజాగా ఓ ఇజ్రాయెల్ మద్యం కంపెనీ భారత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాన్ని మద్యం సీసాలపై ముద్రించింది. మకా బ్రూవరీ అనే లిక్కర్ కంపెనీ తన బీరు సీసాలపై మోడ్రన్ దుస్తుల్లో ఉన్న గాంధీ చిత్రాలను ముద్రించి వివాదానికి తెరలేపింది. దీనిపై కేరళలోని మహాత్మాగాంధీ జాతీయ సంస్థ చైర్మన్ ఎబీజే జోస్ స్పందించారు.
తన జీవితకాలంలో మద్యం, మాంసం అంటే విముఖత కనబర్చిన గాంధీని ఈ విధంగా ఉపయోగించుకోవడం దారుణమని జోస్ అబిప్రాయపడ్డారు. మకా బ్రూవరీ కంపెనీపై చర్యలు తీసుకోవాల్సిందిగా భారత ప్రధాని నరేంద్రమోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులకు లేఖ రాశారు. కాగా, టీషర్టు, దానిపై ఓవర్ కోట్ ధరించిన గాంధీ కూలింగ్ గ్లాసులు పెట్టుకుని ఉన్నట్టుగా ఉన్న ఆ బొమ్మలను అమిత్ శిమోనీ అనే వ్యక్తి రూపొందించినట్టు జోస్ వెల్లడించారు.