England: బెయిర్ స్టో సెంచరీ.... భారత్ కు ఏమాత్రం కలిసిరాని పరిస్థితులు!
- బర్మింగ్ హామ్ లో తేలిపోయిన భారత బౌలింగ్
- టీమిండియా బౌలర్లను చితక్కొట్టి సెంచరీ పూర్తిచేసుకున్న ఇంగ్లాండ్ వికెట్ కీపర్
- టాస్ ఓటమి టీమిండియాకు ప్రతికూలంగా మారిన వైనం
బర్మింగ్ హామ్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న కీలక పోరులో టీమిండియాకు ఏదీ కలిసిరావడంలేదు. టాస్ ఓడిపోవడం నుంచి ప్రధాన బౌలర్ల వైఫల్యం వరకు భారత్ కు అన్నీ ప్రతికూలంగా మారాయి. అందుకు నిదర్శనంగా ఆతిథ్య ఇంగ్లాండ్ కేవలం 31 ఓవర్లలో 204 పరుగులు చేసింది. ఓపెనర్ జానీ బెయిర్ స్టో సెంచరీ పూర్తిచేసుకుని మరింత ఉత్సాహంతో భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తున్నాడు. బెయిర్ స్టో ప్రస్తుతం 114 పరుగులతో ఆడుతుండగా, అతడి స్కోరులో 10 ఫోర్లు, 6 భారీ సిక్సులున్నాయి. మరో ఎండ్ లో జో రూట్ 18 పరుగులతో ఆడుతున్నాడు. మరో 19 ఓవర్ల ఆట మిగిలున్న నేపథ్యంలో ఇంగ్లాండ్ అతి భారీ స్కోరు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఒక్కడికే వికెట్ దక్కింది. 66 పరుగులు చేసిన ఓపెనర్ జాసన్ రాయ్ వికెట్ ను కుల్దీప్ పడగొట్టాడు.