India: స్విస్ బ్యాంకుల్లో ఎక్కువ డబ్బు దాచుకున్నది బ్రిటన్ వాసులే!... ఈ జాబితాలో మన స్థానం 74!
- గతేడాది 73వ స్థానంలో భారత్
- అగ్రస్థానంలో బ్రిటన్
- తర్వాత స్థానంలో అమెరికా
స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటే ఇనప్పెట్టెలో ఉన్నంత భద్రంగా ఉంటుందని ప్రపంచవ్యాప్తంగా బలమైన నమ్మకం ఉంది. అనేక దేశాలకు చెందిన కుబేరులు స్విస్ బ్యాంకుల్లోనే తమ డబ్బును భద్రపరుచుకుంటారన్నది జగమెరిగిన సత్యం. అయితే ఈ డబ్బులో ఎక్కువభాగం నల్లధనమేనని అనేక ఆరోపణలు వస్తుంటాయి. ఈ సంగతి పక్కనబెడితే, స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ అథారిటీ తాజాగా ఓ జాబితా విడుదల చేసింది. స్విస్ బ్యాంకుల్లో ఇతర దేశీయులు దాచుకున్న నగదు, ఇతర నిల్వల ఆధారంగా ఈ జాబితా రూపొందించారు.
ఈ జాబితాలో భారత్ 74వ స్థానంలో ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఓ ర్యాంకు తేడా కనిపించింది. 2018లో భారత్ 73వ ర్యాంకులో నిలిచింది. 2017లో 88వ స్థానంలో ఉండగా, ఒక్కసారిగా 15 స్థానాల తేడా 73వ స్థానానికి చేరుకుంది.
ఇక, స్విస్ బ్యాంకుల్లో అత్యధికంగా డబ్బు దాచుకున్న వ్యక్తులు బ్రిటన్ కు చెందినవారేనని స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ అథారిటీ తన నివేదికలో వెల్లడించింది. ఈ మేరకు జాబితాలో బ్రిటన్ అగ్రస్థానం అలంకరించింది. ఆ తర్వాత స్థానాల్లో అమెరికా, వెస్టిండీస్, ఫ్రాన్స్, హాంకాంగ్ దేశాలున్నాయి.