TTD: కొందరు అలా భావించి నన్ను క్రిస్టియన్ అనుకుని దుష్ప్రచారం చేశారు: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
- టీటీడీ చైర్మన్ పదవి ఎవరికివ్వాలో దేవుడే నిర్ణయిస్తాడు
- జగన్ బాబాయికి ఈ పదవి అనగానే వైఎస్ తమ్ముడు అనుకున్నారు
- నేను పుట్టినప్పటి నుంచి హిందువునే
ఏ పదవి అయినా మనం కోరుకుంటే, దేవుడు అనుగ్రహిస్తే, ప్రజలు సహకరిస్తే పొందవచ్చని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ‘టీవీ 9’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, టీటీడీ చైర్మన్ పదవి మాత్రం ఎవరికి ఇవ్వాలనేది ఆ దేవుడే నిర్ణయిస్తాడని, ఎవరితో సేవ చేయించుకోవాలనేది స్వామి వారే నిర్దేశిస్తారని అభిప్రాయపడ్డారు. స్వామి వారు నిర్ణయించి.. ఆ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మదిలోకి పంపడం వల్లే టీటీడీ చైర్మన్ పదవి తనకు దక్కింది తప్ప, తాను కోరుకోవడం వల్ల వచ్చింది కాదని స్పష్టం చేశారు.
‘ఈ పదవి రావడానికి ముందు మీరు క్రైస్తవులు అనే ప్రచారం జరిగింది కదా?’ అనే దానికి వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం కొన్ని రాజకీయ పార్టీల నాయకులు పన్నిన కుట్రలో భాగమిదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ల బాబాయిని టీటీడీ చైర్మన్ చేస్తున్నారన్న వార్తలు వెలువడ్డాక, వీళ్లందరూ (కొన్ని రాజకీయ పార్టీల నాయకులు) ఏమని భావించారంటే, జగన్ బాబాయి అంటే వాళ్ల నాన్న తమ్ముడని, వాళ్లందరూ క్రైస్తవులని అనుకున్నారని అన్నారు.
క్రైస్తవులను టీటీడీ బోర్డు చైర్మన్ ని ఎలా చేస్తారని వాళ్లందరూ అనుకున్నారని చెప్పారు. అయితే, వీళ్లకు అర్థంకాని విషయమేంటంటే, ‘నేను జగన్మోహన్ రెడ్డి గారి బాబాయిని. జగన్మోహన్ రెడ్డి అమ్మ చెల్లెలి భర్తను అని చాలా మందికి తెలియక దుష్ప్రచారం చేశారు. నేను పుట్టినప్పటి నుంచి హిందువునే. నాకు ఇప్పుడు 59 ఏళ్లు. నా ఇరవై రెండో సంవత్సరం నుంచి నేను శబరిమల పోతున్నా. ఇప్పటి వరకు ముప్పై ఒకటో, ముప్పై రెండు సార్లో శబరిమల వెళ్లాను. ప్రతి సంవత్సరం కనీసం రెండు మూడు సార్లు తిరుమల పోతాను. షిర్డీ రెండు మూడు సార్లు పోతాను. అటువంటి నన్ను హిందువు కాదు క్రిస్టియన్ అని చెబితే, నేను మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చినందుకు నిజంగా చాలా సిగ్గుగా ఉంది’ అని వివరించారు.