Telugudesam: లీజు స్థలాలకు లింక్ డాక్యుమెంట్లు ఉంటాయా?: టీడీపీ విశాఖ అర్బన్ అధ్యక్షుడు రెహమాన్
- అక్రమ కట్టడమని జీవీఎంసీ ఇచ్చిన నోటీసుపై స్పందన
- మా కార్యాలయం ఉన్నది ప్రభుత్వ స్థలంలోనే
- 2001లో తీసుకుని ఏటా లీజు చెల్లిస్తున్నాం
తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉన్నది ప్రభుత్వ స్థలంలోనేనని, 2001లో దాన్ని తమ పార్టీ లీజుకు తీసుకుందని పార్టీ విశాఖ అర్బన్ అధ్యక్షుడు రెహమాన్ స్పష్టం చేశారు. ఆ స్థలంలో తమ కార్యాలయం నిర్మించుకుని ఏటా లీజుకూడా చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. లీజుకు తీసుకున్న స్థలానికి జీవీఎంసీ లింక్ డాక్యుమెంట్లు అడుగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
నగరం నడిబొడ్డున సెవెన్ హిల్స్ ఆసుపత్రి వెనుక భాగాన కొండను తొలిచి టీడీపీ కార్యాలయాన్ని నిర్మించారు. బహుళ అంతస్తుల ఈ భవనానికి ఎటువంటి అనుమతులు లేవని, బాధ్యులు ఈ స్థలానికి సంబంధించి తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లను వారం రోజులు లోగా సమర్పించాలని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) అధికారులు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ స్థలంలో ఉన్న తాత్కాలిక కార్యాలయం స్థానంలో మూడేళ్ల క్రితమే ఆధునిక హంగులతో కొత్త భవనాన్ని నిర్మించారు. లీజుకు తీసుకున్న స్థలంలోని భవనానికి నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
‘మాకు తెలిసి అది ప్రభుత్వ స్థలమే. కానీ తాము నిబంధనల మేరకే లీజుకు తీసుకుని వినియోగించుకుంటున్నాం. ప్రభుత్వ స్థలానికి డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్లు ఎక్కడ నుంచి వస్తాయి?’ అని రెహమాన్ ప్రశ్నించారు. కాగా, జీవీఎంసీ నోటీసులు జారీ చేసి రెండు రోజులు పూర్తికావడంతో ఈ అంశంపై చర్చించేందుకు ఈరోజు పార్టీ అర్బన్ ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నాయకులు అత్యవసరంగా భేటీ అవుతున్నారు. భవనానికి సంబంధించిన అంశంపై చర్చించిన అనంతరం జీవీఎంసీ కమిషనర్ సృజనను కలిసి వివరణ ఇవ్వాలని భావిస్తున్నారు.