Maharashtra: మహారాష్ట్రలో వర్షాలకు కూలుతున్న గోడలు.. 18 మంది మృత్యువాత
- మహారాష్ట్రలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలు
- గోడలు కూలడంతో పెద్ద సంఖ్యలో మరణాలు
- మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోడలు కూలి 18 మంది మృతి చెందారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబైలోని మలాడ్ ఈస్ట్ ప్రాంతంలోని పింప్రిపాదలో సోమవారం రాత్రి గోడకూలి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది గాయపడ్డారు. పూణెలో జరిగిన మరో ఘటనలో ఆరుగురు మృతి చెందారు. అంబేగావ్లోని సింగాడ్ కళాశాల గోడకూలి ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి.
కాగా, మలాడ్ ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందని ఈ ఉదయం ట్వీట్ చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించినట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.