India: బంగ్లాపై మూడోసారి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధం!
- 2007లో ఇండియాపై సంచలన విజయం
- ఆపై రెండు మార్లు ప్రతీకారం తీర్చుకున్న భారత్
- నేడు మరోమారు వరల్డ్ కప్ లో భారత్, బంగ్లా పోరు
మరికాసేపట్లో భారత్, బంగ్లాదేశ్ మధ్య వరల్డ్ కప్ పోరు సాగనుంది. భారత్ కు ఇది క్వార్టర్ ఫైనల్ పోరు వంటిది కాగా, బంగ్లాకు ప్రీ క్వార్టర్ ఫైనల్ పోరని అనుకోవచ్చు. ఇందులో ఇండియా గెలిస్తే, సరాసరి సెమీస్ కు చేరుతుంది. దీంతో ఈ మ్యాచ్ లో గెలవాలన్న పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది.
ఇప్పటివరకూ ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో ఇండియా, బంగ్లాదేశ్ లు మూడు సార్లు తలపడగా, ఒకసారి బంగ్లాదేశ్, రెండుసార్లు భారత్ గెలిచాయి. 2007లో పసికూనగా ఉన్న బంగ్లాదేశ్, ఇండియాను గ్రూప్ దశలో ఓడించి, టోర్నీ నుంచి సాగనంపి పెను సంచలనాన్నే సృష్టించగా, అందుకు ప్రతీకారంగా 2011, 2015 సంవత్సరాల్లో జరిగిన పోటీల్లో ఇండియా విజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. నేడు మరోసారి ఆ జట్టుపై విజయం సాధించి హ్యాట్రిక్ ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉంది.
ఇదే సమయంలో తాము లెక్కను సరిచేస్తామని 2015లో ఓటమికి బదులిస్తామని బంగ్లాదేశ్ నమ్మకంతో ఉంది. ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ తో పాటు స్పిన్ బౌలింగ్ పై ఆశలు పెట్టుకుని, భారత స్టార్ ఆటగాళ్లను నిలువరిస్తామని అంటోంది. కాగా, ఇండియాతో పాటు పాక్ పైనా బంగ్లాదేశ్ గెలిచి, న్యూజిలాండ్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోతే ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు ఉంటాయి.