Guntur District: ఇది వైసీపీ ఆగడాలకు పరాకాష్ఠ.. దయచేసి, మమ్మల్ని కాపాడండి: టీడీపీ నేత ప్రత్తిపాటి అనుచరుడు బుచ్చిబాబు
- చిలకలూరిపేటలో బుచ్చిబాబు ఇంటిపై దాడి
- బుచ్చిబాబు ఇంట్లో లేని సమయంలో దాడి ఘటన
- ఇంట్లోని ఫర్నిచర్, సీసీ కెమెరాలు ధ్వంసం
ఏపీలో తమ కార్యకర్తలపై, నాయకులపై వైసీపీ దాడులు చేస్తోందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో మరో దాడి జరిగింది. ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు అనుచరుడు బుచ్చిబాబు ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో బుచ్చిబాబు నివసిస్తున్నారు. ఇంట్లో ఆయన లేని సమయంలో ఈ దాడి జరిగింది. ఈ దాడి నుంచి తమను తాము రక్షించుకునేందుకు బుచ్చిబాబు కుటుంబసభ్యులు ఇంట్లో తలుపులు వేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బుచ్చిబాబు మీడియాకు వివరించారు. నిన్న సాయంత్రం ఓ సెల్ నెంబర్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, తనను దుర్భాషలాడుతూ మాట్లాడారని అన్నారు.
అసభ్య పదజాలం ఉపయోగిస్తూ తనను తిడుతూ మాట్లాడిన వ్యక్తిని అతని పేరు చెప్పమని అడిగితే చెప్పలేదని, ఆ తర్వాత కొద్దిసేపటికి తన పేరు ‘మల్లెల రాము’ అని చెప్పాడని అన్నారు. నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు? అని తనను ప్రశ్నించాడని, ‘గుంటూరులో ఉన్నాను. వచ్చిన తర్వాత కాల్ చేస్తాను’ అని సమాధానం చెప్పానని అన్నారు.ఈలోపే తన ఇంటి వద్దకు వచ్చి గందరగోళం చేశారని ఆరోపించారు.
ఈ సందర్భంగా గతంలో తన ఇంటిపై జరిగిన దాడి గురించీ ఆయన ప్రస్తావించారు. మళ్లీ ఇలాంటి ఘటనలకు ఆస్కారం ఉందని భావించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు. మమ్మల్ని చంపుతామని, మా పిల్లలను చంపుతామని ఇప్పటికే బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ దాడులకు భయపడి ఇక్కడి ఇంటిని అమ్మకానికి పెట్టామని చెప్పారు.
‘భగవంతుడు అనే వాడు ఉంటే మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నా. కిరాయి గూండాలతో బెదిరిస్తూ, మమ్మల్ని చంపడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇది వైసీపీ వాళ్ల ఆగడాలకు పరాకాష్ఠ. దయచేసి, మీడియా మిత్రులు గానీ, డీజీపీ, ఎస్పీ, కలెక్టర్ గారు గానీ మాకు రక్షణగా ఉండి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాను’ అని బుచ్చిబాబు వేడుకున్నారు.
బుచ్చిబాబు భార్య లక్ష్మి మాట్లాడుతూ, నిన్న ముప్పై మంది వచ్చారని, తాను, తన కొడుకు, కోడలు ఇంట్లో ఉన్నామని చెప్పారు. కేకలు పెట్టుకుంటూ వచ్చారని, భయపడి పోయి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నామని చెప్పారు. ఇనుపరాడ్లు, కర్రలతో తలుపులు, సీసీ కెమెరాలను, ఇంటి బయట ఉన్న తమ వాహనాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు.