India: రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసిన బుమ్రా... విజయంతో సెమీస్ కు దూసుకెళ్లిన టీమిండియా
- కీలక మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఓటమి
- 28 పరుగులతో టీమిండియా విన్
- బుమ్రాకు 4 వికెట్లు
భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ సెమీఫైనల్లో ప్రవేశించింది. బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో టీమిండియా 28 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించింది. ఓ దశలో బంగ్లా చివరి వరుస బ్యాట్స్ మెన్ భారత్ ను భయపెట్టినా, వరల్డ్ నంబర్ వన్ బౌలర్ బుమ్రా వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి జట్టుకు విజయాన్నందించాడు.
315 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ జట్టు గట్టిగానే పోరాడినప్పటికీ 48 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఆల్ రౌండర్ మహ్మద్ సైఫుద్దీన్ 51 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. సైఫుద్దీన్ 38 బంతులాడి 9 బౌండరీలు బాదాడు. ఇక, టీమిండియా బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్య 3 వికెట్లు సాధించాడు.
అంతకుముందు భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ సెంచరీ సాయంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 77 పరుగులు సాధించాడు. ఈ విజయంతో భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే ఘనంగా సెమీస్ లో అడుగుపెట్టింది. ప్రపంచకప్ లో ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడిన భారత్ 6 విజయాలు, 13 పాయింట్లతో సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. కోహ్లీసేన తన చివరి లీగ్ మ్యాచ్ లో శ్రీలంకతో తలపడనుంది.