Imran khan: పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆస్తులు రూ.10.8 కోట్లు.. వెల్లడించిన ఎన్నికల కమిషన్
- రాజకీయ నాయకుల ఆస్తుల వివరాలను వెల్లడించిన ఈసీ
- ఇమ్రాన్ పార్టీకి రూ.31.6 కోట్ల విలువైన ఆస్తులు
- సంపన్న నేతగా బిలావల్ భుట్టో
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు రూ.10.8 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు ఆ దేశ ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. ఇమ్రాన్‌కు మూడు విదేశీ కరెన్సీ ఖాతాలు, రూ.50 వేల విలువ చేసే నాలుగు మేకలు ఉన్నాయి. ఇస్లామాబాద్ శివారులో ఉన్న బనీ గలా ఎస్టేట్‌ను తన మొదటి భార్య, బ్రిటిష్ పాత్రికేయురాలు జెమీమా గోల్డ్‌స్మిత్ కానుకగా ఇచ్చింది. ఆయన భార్య బుర్షా బీబీకి పాక్‌పట్టాన్ భూమి, ఒకరాలో భూమి ఉంది. అలాగే, ఇమ్రాన్‌కు 150 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది.
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో రూ.150 కోట్ల సంపదతో అత్యంత ధనవంతుడైన నేతగా ఉన్నారు. పాక్ మాజీ అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారీకి రూ. 66 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అలాగే, కోటి రూపాయల విలువ చేసే జంతువులు, రూ.1.66 కోట్ల విలువైన ఆయుధాలు ఉన్నాయి. నగదు అక్రమ రవాణా కేసుల్లో ప్రస్తుతం ఆయన ఏసీబీ కస్టడీలో ఉన్నారు. ఇక, ప్రధాని ఇమ్రాన్ సారథ్యంలోని పీటీఐ పార్టీ రూ.31.6 కోట్లతో అత్యధిక ఆస్తులు కలిగిన పార్టీగా అవతరించింది.