Instagram: యువతిని బెదిరించి 20 తులాల బంగారాన్ని కాజేసిన ఇన్స్టాగ్రామ్ ప్రేమికుడు!
- ఇన్స్టాగ్రామ్ ద్వారా సూర్యపేట యువతికి యానాం యువకుడి వల
- ప్రేమ పేరుతో పలకరింపులు
- వలలో చిక్కాక ఫొటోలు చూపి బంగారం దోచుకున్న వైనం
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయాన్ని ప్రేమ వరకు తీసుకెళ్లి ఆపై యువతిని నిలువునా ముంచేశాడో యువకుడు. ఆమెను బెదిరించి దాదాపు రూ.6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కాజేశాడు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగిందీ ఘటన. స్థానికంగా ఎం.ఫార్మసీ చదువుతున్న యువతికి కేంద్రపాలిత ప్రాంతమైన యానాంకు చెందిన కుర్రి సతీశ్‌తో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎనిమిది నెలల క్రితం పరిచయమైంది. అది క్రమంగా పెరిగి పెద్దదై ప్రేమకు దారి తీసింది.
ఈ క్రమంలో పలుమార్లు సూర్యాపేటకు వచ్చిన సతీశ్ ఆమెను కలిశాడు. తానో స్థిరాస్తి వ్యాపారినని ఆమెను నమ్మించాడు. ఈ సందర్భంగా ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు తీసుకున్నాడు. ఆ తర్వాత అతడి అసలు రూపాన్ని బయటకు తీశాడు. తనకు డబ్బులు అవసరం ఉందని, సర్దుబాటు చేయాలని కోరాడు. తన వద్ద డబ్బు లేదని చెప్పినా అతడు వినలేదు. ఫొటోలు చూపించి బెదిరించాడు.
సతీశ్ బెదిరింపులతో దిక్కుతోచని యువతి మూడు నెలల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బీరువాలో ఉన్న 20 తులాల బంగారు ఆభరణాలను తీసి సతీశ్‌కు ఇచ్చింది. నగలు మాయం కావడంతో యువతి తాత ఏప్రిల్ 16న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఇచ్చిన బంగారం సరిపోలేదని, మరికొంత సొమ్ము కావాలని సతీశ్ తాజాగా బెదిరించడంతో యువతి ఈ విషయాన్ని తాతయ్య, అమ్మమ్మలకు చెప్పింది. వారు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో సతీశ్ కదలికలపై నిఘా పెట్టి మంగళవారం అరెస్ట్ చేశారు.