Andhra Pradesh: ట్రావెల్స్ బస్సుల్లో ప్యాసింజర్ జాబితా ముందే పొందుపరచాలి: ఏపీ మంత్రి పేర్ని నాని
- రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష
- నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు ట్రావెల్స్ లో తనిఖీలు చేయాలి
- టూరిస్ట్ అనుమతితో స్టేజ్ క్యారేజ్ లుగా వాహనాలు నడపొద్దు
ట్రావెల్స్ బస్సుల్లో ప్యాసింజర్ జాబితాను ముందే పొందుపరచాలని ఏపీ మంత్రి పేర్ని నాని ఆదేశించారు. రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ పై తనిఖీలు, రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై సమీక్షించారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు ట్రావెల్స్ లో తనిఖీలు చేయాలని, అధికారులంతా జాతీయ రహదారులపై ముమ్మర తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
టూరిస్ట్ అనుమతితో స్టేజ్ క్యారేజ్ లుగా వాహనాలను నడపడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని, ఇలా నడుపుతున్న ట్రావెల్స్ తనిఖీలు కొనసాగుతాయని, స్టేజ్ క్యారేజ్ లు గా బస్సులు నడిపేవారు వెంటనే వాటిని ఆపివేయాలని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి నడిపే ట్రావెల్స్ బస్సులను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నామని, ప్రమాదాల నివారణకు కేంద్ర నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ప్రమాదాల నివారణకు రూ.100 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకరించారని అన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనానికి అధ్యయనం జరుగుతోందని, ఇందుకు సంబంధించిన కమిటీ తొంభై రోజుల్లోగా నివేదిక ఇవ్వనుందని అన్నారు.