Saravanabhavan: జ్యోతిష్యాన్ని నమ్మి... హత్య చేయించిన 'శరవణ భవన్' యజమాని ... ఇక జీవితాంతం జైల్లోనే!
- విదేశాలకూ విస్తరించిన శరవణ భవన్
- వివాహితను పెళ్లాడితే లాభం కలుగుతుందని చెప్పిన జ్యోతిష్యుడు
- వినకపోవడంతో భర్తను హత్య చేయించిన రాజగోపాల్
శరవణ భవన్... ఈ హోటల్ పేరును వినని దక్షిణాది వారు ఉండరంటే అతిశయోక్తికాదు. ఓ మారుమూల గ్రామంలో ఉల్లిపాయలు అమ్ముకునే స్థాయి నుంచి రాజగోపాల్ అనే వ్యక్తి, 1981లో చెన్నైకి వచ్చి, ప్రారంభించిన రెస్టారెంట్, ఇప్పుడు అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలకు సైతం విస్తరించి ఎంతో పేరును, ప్రఖ్యాతిని తెచ్చిపెట్టుకుంది. ఇడ్లీ, వడ, దోశ, పొంగల్, భోజనం... ఏదైనా సరే జిహ్వచాపల్యాన్ని తీర్చేలా చేసిన హోటల్ అది.
అయితేనేం, ఇప్పుడా శరవణ భవన్ హోటల్ యజమాని రాజగోపాల్, యావజ్జీవ జైలుశిక్షను అనుభవించనున్నాడు. వచ్చే ఆదివారం నుంచి ఆయన శిక్ష మొదలుకానుంది. తన హోటల్ లో పని చేస్తున్న యువతి భర్తను దారుణంగా హత్య చేయించినందుకు ఈ శిక్ష పడింది.
వివరాల్లోకి వెళితే... అప్పటికే ఇద్దరు భార్యలున్న రాజగోపాల్, ఈ అమ్మాయిని మూడో భార్యగా చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందని, వ్యాపారంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగవచ్చని ఓ జ్యోతిష్యుడు చెప్పడంతో, దాన్ని గుడ్డిగా నమ్మాడు. ఆ అమ్మాయికి పెళ్లయిందన్న విషయాన్ని కూడా మరిచిపోయి, తన మనసులోని కోరికను చెప్పాడు. ఆమె అంగీకరించకపోవడంతో, రాజగోపాల్ లోని నేరగాడు బయటకు వచ్చాడు. తనను కాదన్నదన్న కోపంతో ఆమె భర్తను 2001లో దారుణంగా చంపించాడు.
ఈ కేసు పదేళ్లకు పైగా సాగగా, కింది కోర్టు పదేళ్ల కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ, రాజగోపాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కేసును విచారించిన ధర్మాసనం, ఈ శిక్ష చాలదని, దీన్ని యావజ్జీవంగా ఖరారు చేస్తున్నామని స్పష్టం చేసింది. ఆదివారం నుంచి రాజగోపాల్ జైలు శిక్ష అమలు కానుంది.