Gayle: చివరి మ్యాచ్ లోనూ చెత్తగా అవుటైన గేల్... సెంచరీ మార్కు దాటిన విండీస్
- అభిమానులను నిరాశపరిచిన గేల్
- 7 పరుగులకే పెవిలియన్ చేరిక
- విండీస్ 30 ఓవర్లలో 147
మెరుపువీరుడు క్రిస్ గేల్ తన కెరీర్ లో చివరి వరల్డ్ కప్ మ్యాచ్ లో కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. వరల్డ్ కప్ ను తనదైన శైలిలో ఘనంగా ముగిస్తాడని ఆశించిన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాడు. ఆఫ్ఘనిస్థాన్ తో వరల్డ్ కప్ మ్యాచ్ లో గేల్ ఎంతో పేలవంగా వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ టోర్నీలో గేల్ ఆడాడన్న మాటే కానీ, అతడి పూర్వవైభవాన్ని గుర్తుచేసే ఒక్క ఇన్నింగ్స్ కూడా లేదు.
గేల్ ఈ వరల్డ్ కప్ లో చేసిన స్కోర్లు చూస్తే, పాకిస్థాన్ పై నాటింగ్ హామ్ లో 50, ఆస్ట్రేలియాపై నాటింగ్ హామ్ లోనే 21, ఇంగ్లాండ్ పై సౌతాంప్టన్ లో 36, మాంచెస్టర్ లో కివీస్ పై 87, శ్రీలంకపై 35 పరుగులు మాత్రమే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్. బంగ్లాదేశ్ (0), భారత్ (6)పై దారుణంగా విఫలమైన గేల్, చివర్లో ఆఫ్ఘన్ పైనా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. ఇక, విండీస్ విషయానికొస్తే, 30 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. క్రీజులో షై హోప్ (50), షిమ్రోన్ హెట్మెయర్ (29) ఆడుతున్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో దౌలత్ జాద్రాన్, రషీద్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.