Tik Tok: సుప్రీంకోర్టు నిర్ణయంతో పిటిషన్ ను వెనక్కి తీసుకున్న టిక్ టాక్
- టిక్ టాక్ ను బ్యాన్ చేసిన మద్రాస్ హైకోర్టు
- సుప్రీంను ఆశ్రయించిన టిక్ టాక్
- కేసును స్వీకరించలేమంటూ సుప్రీం చెప్పడంతో వెనక్కితగ్గిన టిక్ టాక్
సోషల్ మీడియా రంగంలో టిక్ టాక్ యాప్ ఓ విప్లవం అని చెప్పాలి. సాధారణ వ్యక్తులను సైతం పదిమందికీ తెలిసేట్టు చేయడంలో టిక్ టాక్ ఘనత అంతాఇంతా కాదు. అయితే, ఈ యాప్ కారణంగా అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్ తయారవుతోందని, ఇది బాలలపై దుష్పరిణామాలు చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే టిక్ టాక్ యాప్ ను నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ విచారణ జరిపి నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ టిక్ టాక్ సంస్థ అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ కు పలు సూచనలు చేసింది. ఆ మార్గదర్శకాల అనుగుణంగా మద్రాస్ హైకోర్టు కేసును పరిశీలనలో ఉంచింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో, మద్రాస్ హైకోర్టు టిక్ టాక్ ను నిషేధించాలంటూ కేసును సుప్రీంకు బదలీ చేయగా, దీన్ని టిక్ టాక్ మరోసారి సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ దీనిపై విచారణ జరుపుతూ, ఈ కేసును మద్రాస్ హైకోర్టు పరిష్కరిస్తుందని, బదిలీ చేసిన కేసును తాము స్వీకరించలేమని స్పష్టం చేశారు. దాంతో తమ పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నట్టు టిక్ టాక్ వర్గాలు వెల్లడించాయి.