Andhra Pradesh: టీడీపీ కార్యకర్తల కోసం ఫేస్ బుక్ పేజీని ప్రారంభించిన నారా లోకేశ్!
- వైసీపీ వేధింపులపై ఫిర్యాదు చేయాలని విన్నపం
- అభ్యంతకర పోస్టులను పార్టీ దృష్టికి తీసుకురావాలని సూచన
- వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ తెలిపారు. వైసీపీ నేతలు బెదిరించినా, దాడిచేసినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కేసులు పెట్టి వేధించినా టీడీపీ ప్రత్యేక విభాగం నంబర్ 7306299999కు సమాచారం అందించాలని సూచించారు. ఎల్లవేళలా పార్టీకి అండగా ఉన్న కార్యకర్తలు, అభిమానులను రక్షించుకోవడం తమ బాధ్యత అని వ్యాఖ్యానించారు. అలాగే టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులను ఆదుకునేందుకు ప్రతీ జిల్లాకు లీగల్ సెల్ ఏర్పాటు చేశామని లోకేశ్ పేర్కొన్నారు.
టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులు తమపై ఎదురైన వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు https://www.facebook.com/tdpsocialmedialegalcell అనే ఫేస్ బుక్ పేజీని ప్రారంభించామని తెలిపారు. సోషల్ మీడియాలో ఎలాంటి అభ్యంతరకరమైన పోస్టులైనా కార్యకర్తల దృష్టికి వస్తే, ఈ పేజీ వేదికగా పంచుకోవాలని కోరారు. అలాంటి వ్యక్తులపై చట్టపరమైన పోరాటం చేస్తామనీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.