Pakistan: ఇమాముల్ సెంచరీ, అజామ్ క్లాస్ ఇన్నింగ్స్... పాకిస్థాన్ భారీ స్కోరు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
- 50 ఓవర్లలో 9 వికెట్లకు 315 రన్స్
- ముస్తాఫిజూర్ కు 5 వికెట్లు
బంగ్లాదేశ్ తో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ప్రపంచకప్ లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఈ పోరులో పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఎడమచేతివాటం ఓపెనర్ ఇమాముల్ హక్ సరిగ్గా 100 బంతుల్లో 100 పరుగులు చేయగా, స్టార్ బ్యాట్స్ మన్ బాబర్ అజామ్ మరోసారి క్లాస్ టచ్ ఇచ్చాడు. అజామ్ 98 బంతుల్లో 11 ఫోర్లతో 96 పరుగులు చేశాడు. మిడిలార్డర్ లో ఇమాద్ వాసిమ్ 26 బంతుల్లో 6 ఫోర్లు ఒక సిక్స్ సాయంతో 43 పరుగులు రాబట్టాడు. ఈ ముగ్గురు తప్ప పాకిస్థాన్ లైనప్ లో కుదురుగా ఆడినవాళ్లే లేరు. ఉన్నంతలో వెటరన్ బ్యాట్స్ మన్ మహ్మద్ హఫీజ్ ఫర్వాలేదనిపించినా అతని స్కోరు 27 పరుగులే.
ఇక, పాక్ టాపార్డర్ ఎదురుదాడి చేసినా, బంగ్లాదేశ్ బౌలర్లు ఆపై తేరుకుని వరుసగా వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి మరీ భారీ స్కోరు చేయకుండా నిలువరించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజూర్ పరుగులు భారీగా ఇచ్చినా 5 వికెట్లు సాధించాడు. అయితే, తన 10 ఓవర్ల కోటాలో ఈ లెఫ్టార్మ్ పేసర్ 75 పరుగులు సమర్పించుకున్నాడు. మరో కొత్తబంతి బౌలర్ మహ్మద్ సైఫుద్దీన్ 9 ఓవర్లు బౌల్ చేసి 77 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ముస్తాఫిజూర్, సైఫుద్దీన్ తొలి స్పెల్ లో పాక్ బ్యాట్స్ మెన్ దూకుడుకు బలైనా, చివర్లో మాత్రం ప్రతీకారం తీర్చుకున్నారు. వరుసపెట్టి పాక్ వికెట్లను పంచుకున్నారు.