One Plus: స్విచాఫ్ చేసి, అన్ ప్లగ్ మోడ్‌లో ఉంచినా పేలిన వన్‌ప్లస్ ఫోన్!
- గది ఉష్టోగ్రత కూడా 19 డిగ్రీలే
- తయారీలో లోపం వల్లే జరిగిందంటున్న రాహుల్
- స్పందించిన వన్‌ప్లస్ సంస్థ
స్విచాఫ్ చేసి, అన్ ప్లగ్ మోడ్‌లో ఉంచినప్పటికీ తన ఫోన్ పేలిందంటూ ఓ వినియోగదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఢిల్లీకి చెందిన రాహుల్ హిమాలయన్ అనే వ్యక్తికి చెందిన ‘వన్‌ప్లస్’ ఫోన్, స్విచాఫ్ చేసి, అన్‌ప్లగ్ మోడ్‌లో ఉంచినప్పటికీ పేలిందట. ఈ ఘటన ఈ నెల 3న జరిగిందని, ఆ సమయంలో గది ఉష్టోగ్రత కూడా 19 డిగ్రీలే ఉందని, అయినా ఫోన్ పేలిందని పేర్కొన్నాడు. తాను లేచి చూసేసరికి తన ఫోన్ కాలిపోతూ కనిపించిందని, వెంటనే దానిపై నీళ్లు చల్లి మంటలను ఆర్పానని రాహుల్ పేర్కొన్నాడు.
దీనికి సంబంధించిన ఫోటోలను రాహుల్ స్నేహితుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. అయితే తాను వాడుతున్న వన్‌ప్లన్ ఫోన్ ఐదేళ్ల క్రితం నాటిదని, తయారీలో లోపం వల్లే ఇలా జరిగి ఉంటుందని రాహుల్ తెలిపాడు. దీనికి వన్‌ప్లస్‌తో పాటు దాన్ని అమ్మిన అమెజాన్ సంస్థ సంయుక్తంగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై స్పందించిన వన్‌ప్లస్ సంస్థ, ఇలాంటి ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వెంటనే తమ బృందాన్ని వినియోగదారుడి వద్దకు పంపినట్టు తెలిపింది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్టు పేర్కొంది.