Pakistan: ఆరు వికెట్లు తీసి బంగ్లా వెన్నువిరిచిన షహీన్ అఫ్రిది... పరువు దక్కించుకున్న పాకిస్థాన్

  • బంగ్లాదేశ్ పై 94 పరుగుల తేడాతో విజయం
  • ఇరు జట్లకు ఇదే చివరి లీగ్ మ్యాచ్
  • మ్యాచ్ గెలిచినా సెమీస్ చాన్స్ చేజార్చుకున్న పాక్

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ప్రస్థానం విజయంతో ముగిసింది. బంగ్లాదేశ్ తో లార్డ్స్ మైదానంలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో పాక్ 94 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పాక్ యువ పేసర్ షహీన్ షా అఫ్రిది నిప్పులు చెరిగే బంతులకు బంగ్లాదేశ్ వద్ద సమాధానం లేకపోయింది. 316 పరుగుల లక్ష్యంతో బరిలో దిగన బంగ్లా జట్టు చివరికి 44.1 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది.

షహీన్ అఫ్రిది తన సంచలనాత్మక బౌలింగ్ స్పెల్ లో 9.1 ఓవర్లలో 35 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్ కప్ లో ఆరు వికెట్లు తీయడం చాలా అరుదైన విషయం. ఇక, షాదాబ్ ఖాన్ 2, అమీర్, రియాజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. బంగ్లాదేశ్ జట్టులో ఆల్ రౌండర్ షకీబల్ హసన్ తన ఫామ్ ను కొనసాగిస్తూ అర్ధసెంచరీతో మెరిశాడు. షకిబ్ 77 బంతుల్లో 64 పరుగులు చేశాడు. అయితే, ఇతర బ్యాట్స్ మన్లలో ఆ స్థాయి ఇన్నింగ్స్ మరొకటి లేకపోవడంతో బంగ్లా భారీతేడాతో ఓటమిపాలైంది. లిటన్ దాస్ 32, మహ్మదుల్లా 29 పరుగులు చేశారు.

అంతకుముందు, టాస్ గెలిచిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 315 పరుగులు చేసింది. అయితే, పాక్ ఈ మ్యాచ్ గెలవకముందే సెమీస్ అవకాశాలను కోల్పోయింది. బంగ్లాపై 316 పరుగుల తేడాతో గెలిస్తే సెమీస్ బెర్తు దక్కే అవకాశాలున్నా, పాక్ ఆ అద్భుతాన్ని చేయడంలో విఫలమైంది.

  • Loading...

More Telugu News