Naigerian: అమ్మాయిలను మోసం చేసే నిత్య పెళ్లికొడుకు... ఊచలు లెక్కబెట్టిస్తున్న హైదరాబాద్ పోలీసులు!
- డబ్బున్న అమ్మాయిలే టార్గెట్
- నమ్మించి మోసం చేసే ఒనియనోర్
- అరెస్ట్ చేసిన పోలీసులు
పెళ్లి చేసుకోవాలని చూసే అమ్మాయిలే అతని టార్గెట్. బాగా డబ్బున్న వారిని మాత్రమే ఎంచుకుంటాడు. ఆపై తాను కోటీశ్వరుడినని చెబుతాడు. పెళ్లాడతానని నమ్మబలుకుతాడు. వారికి నచ్చేట్టుగా మాట్లాడతాడు. అమ్మాయి పూర్తిగా నమ్మిందని అర్థం చేసుకున్న తరువాత తన మోసానికి తెరలేపుతాడు. పెళ్లికి ముందే బహుమతులు పంపుతున్నానని చెప్పి, లక్షలకు లక్షలు గుంజేస్తాడు. నైజీరియా నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ వ్యక్తి చేస్తున్న దందా ఇది. తమకు వచ్చిన ఓ ఫిర్యాదుతో అతని ఆటను కట్టించిన హైదరాబాద్ పోలీసులు, ఇప్పుడతన్ని ఊచల వెనక్కు నెట్టారు.
వివరాల్లోకి వెళితే, నగరానికి చెందిన ఓ యువతి, వివాహం నిమిత్తం మ్యాట్రిమోనియల్ సైట్ లో పేరు నమోదు చేసుకుంది. అది చూసిన నిందితుడు ఒనియనోర్ ఎలోనియం బ్రైట్, తాను లండన్ లో ఉంటున్నానని పరిచయం చేసుకున్నాడు. తమ పేరు బాసిమ్ కరీమ్ అని చెప్పుకున్నాడు. వివాహం చేసుకునేందుకు సిద్ధమన్నాడు. అది నమ్మిన యువతి అతనితో పరిచయం పెంచుకుంది. ఆపై తాను భారీగా నగదు, గిఫ్ట్ లతో ఇండియాకు వస్తున్నానని చెప్పాడు.
మరుసటి రోజు న్యూఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులమంటూ ఆమెకు ఓ ఫోన్ వచ్చింది. కరీమ్ అనే యువకుడు లండన్ నుంచి వచ్చాడని, అతను తెచ్చిన వస్తువులకు సుంకాలు చెల్లించకపోవడంతో ఆపేశామని చెప్పారు. అతన్ని విడిచిపెట్టాలంటే, పన్ను చెల్లించాలని చెప్పగా, ఆమె పలు దఫాలుగా రూ.16.37 లక్షలు వారు చెప్పిన బ్యాంకు ఎకౌంట్ లో వేసింది. ఆపై అతని ఫోన్ స్విచ్చాఫ్ కాగా, బాధితురాలి ఫిర్యాదుతో విచారణ జరిపిన పోలీసులు, ఒనియనోర్ ను గుర్తించి అరెస్ట్ చేశారు. అతనిపై గతంలోనూ ఇదే తరహాలో పలు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.