Himachal Pradesh: హిమాలయాల్లో 18,570 అడుగుల ఎత్తులో... 72 అడుగుల శివలింగం... శ్రీఖండ్ యాత్ర గురించి తెలుసా?
- అమర్ నాథ్ యాత్రను మించి క్లిష్ట వాతావరణం
- ఏర్పాట్లు పూర్తి చేసిన హిమాచల్ ప్రదేశ్ సర్కార్
- 15 నుంచి పది రోజుల పాటు యాత్ర
హిమాలయాల్లో శైవ భక్తుల యాత్ర మాట వినగానే అమర్ నాథ్ యాత్రే గుర్తుకు వస్తుంది. అమర్ నాథ్ యాత్ర అత్యంత వ్యయ ప్రయాసలతో కూడుకుంది. కానీ, అంతకుమించిన శ్రమతో భక్తులు వెళ్లే శ్రీఖండ్ యాత్రను ఈ సీజన్ లో విజయవంతం చేసేందుకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ ప్రభుత్వం సంకల్పించింది.
ఈ సంవత్సరం శ్రీఖండ్ మహదేవ్ యాత్రను ఈ నెల 15 నుంచి 25 వరకూ నిర్వహించాలని నిర్ణయించింది. సముద్రమట్టానికి 18,570 అడుగుల ఎత్తులో హిమాలయ పర్వతాల మధ్యలో 72 అడుగుల ఎత్తున ఉండే శివలింగాన్ని దర్శించుకునేందుకు ఈ యాత్రను భక్తులు చేపడతారు.
హిమాచల్ ప్రదేశ్ లో సముద్రమట్టానికి ఆరువేల అడుగుల ఎత్తులో ఉండే సింగ్ హడ్ బేస్ క్యాంపు నుంచి ఈ శ్రీఖండ్ యాత్ర ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి 32 కి.మీ. దూరంలోని శ్రీఖండ్ మహదేవ్ ను దర్శించుకుని, వెనక్కు తిరిగి వచ్చేందుకు 10 రోజుల సమయం పడుతుందంటే, అక్కడి వాతావరణ పరిస్థితులు, యాత్రలో కష్టాలను ఊహించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కులూ జిల్లా అధికార యంత్రాంగం ఈ యాత్ర కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ యాత్రలో భాగంగా, పూర్తిగా మంచుతో కప్పబడిన సుమారు ఆరు కిలోమీటర్ల దూరాన్ని భక్తులు దాటి వెళ్లాల్సి వుంటుంది.