Chennai: రూ.76కే బిర్యానీ అంటూ.. 40 వేలు నొక్కేసిన కేటుగాళ్లు!
- ఫుడ్ యాప్ నుంచి వచ్చిన నోటిఫికేషన్‌కు మోసపోయిన విద్యార్థి
- ఆర్డర్ చేస్తే రాని బిర్యానీ
- డబ్బులు వెనక్కి ఇవ్వమన్నందుకు భారీ మూల్యం
రూ. 76కే బిర్యానీ అని ఆశ చూపి ఏకంగా రూ.40 వేలు కొట్టేశారు కేటుగాళ్లు. చెన్నైలో జరిగిందీ ఘటన. నగరానికి చెందిన విద్యార్థిని ప్రియ మొబైల్ ఫోన్‌కు రూ.76కే బిర్యానీ అంటూ ఓ ఫుడ్ యాప్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అది చూసిన వెంటనే ఆమె ఆర్డర్ చేసింది. అయితే, గంటలు గడుస్తున్నా బిర్యానీ రాకపోవడంతో ఫోన్ చేసి కనుక్కుంది. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరింది.
అయితే, రూ.76ను ఆన్లైన్లో వెనక్కి పంపడం సాధ్యం కాదని, మరో రూ.5 వేలు జమచేస్తే మొత్తం రూ.5,076లు పంపిస్తామని చెప్పడంతో నిజమేనని నమ్మిన ప్రియ వారు అడిగిన మొత్తాన్ని పంపింది. అయినప్పటికీ డబ్బులు వెనక్కి రాకపోవడంతో మరోమారు ఫోన్ చేసింది. అయితే, ఆ మొత్తం కూడా పంపడం సాధ్యం కావడం లేదని, కాబట్టి మరికొంత సొమ్ము పంపాలని యాప్ నిర్వాహకులు కోరారు.
వారి మాటలు నిజమని నమ్మిన ప్రియ అలా మొత్తం రూ.40 వేలు సమర్పించుకుంది. ఆ తర్వాత కూడా వారి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.