Crime News: ఎయిర్‌ ఏషియా ప్రతినిధి నంటూ ఫోన్‌...బ్యాంకు ఖాతా నుంచి రూ.69 వేలు మాయం

  • ఇదో నయా మోసం
  • విమాన టికెట్ల కోసం ప్రయత్నించగా అపరిచిత వ్యక్తి కాల్‌
  • ఖాతా వివరాలు చెప్పగానే అతని అకౌంట్ కు నగదు బదిలీ

సైబర్‌ క్రైం నేరగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త దారులు వెతుకుతున్నారనేందుకు ఈ మోసం ఓ ఉదాహరణ. విమాన ప్రయాణ టికెట్ల కోసం ప్రయత్నించిన వ్యక్తికి ఎయిర్‌ ఏషియా ప్రతినిధిని అంటూ ఫోన్‌చేసి, వివరాలు తెలుసుకున్న అనంతరం అతని బ్యాంకు ఖాతా నుంచి దాదాపు 69 వేల నగదు మాయం చేసిన ఘరానా మోసం ఇది.

వివరాల్లోకి వెళితే...ఖమ్మం జిల్లా వైరాలోని సంతబాజర్‌కు చెందిన గున్నాల నరేష్‌ ఎల్‌ఐసీ ఏజెంట్‌. ఆగస్టు 4న బెంగళూరులో అతనో సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. విమానం టికెట్ల కోసం ఎయిర్‌ ఏషియా కస్టమర్‌ కేర్‌ ప్రతినిధితో మాట్లాడే ప్రయత్నం చేయగా లైన్‌ కలవలేదు. కాసేపటికి అటు నుంచి ఫోన్‌ వచ్చింది. తాను ఎయిర్‌ ఏషియా నుంచి ఫోన్‌ చేస్తున్నానని, మీరు కస్టమర్‌ కేర్‌కు ప్రయత్నించారు కదా, విషయం ఏంటో చెప్పాలని కోరాడు.

నిజంగానే అతను ఎయిర్‌ ఏషియా ప్రతినిధి అని నమ్మిన నరేష్‌ తనకు బెంగళూరుకు పది పోను, రాను టికెట్లు కావాలని కోరాడు. దీంతో టికెట్‌ ధర రూ.2,300 లని, పది శాతం డిస్కౌంట్‌ లభిస్తుందని అవతలి వ్యక్తి నమ్మబలికాడు. మొత్తం రెండు వైపులా టికెట్లు బుక్‌ చేస్తున్నానని, బ్యాంకు ఖాతా వివరాలు తెలియజేయాలని కోరాడు. వివరాలు చెప్పగానే ఫోన్‌ పెట్టేశాడు.

అనంతరం కొద్దిసేపటికి నరేష్‌ ఖాతా నుంచి దఫదఫాలుగా 46,300 విత్‌ డ్రా అయినట్లు అతని సెల్‌ఫోన్‌కి మెసేజ్‌ వచ్చింది. దీంతో అవతలి వ్యక్తి టికెట్లు బుక్‌ చేస్తున్నాడని నరేష్‌ అనుకున్నాడు. కాసేపటికి అతని మరో ఖాతా నుంచి రూ.22,500 విత్‌ డ్రా అయినట్లు మెసేజ్‌ వచ్చింది. తాను వివరాలు ఇవ్వని ఖాతా నుంచి కూడా నగదు విత్‌ డ్రా కావడంతో అనుమానం వచ్చిన నరేష్‌ అవాక్కయ్యాడు.

వెంటనే బ్యాంకు అధికారులను సంప్రదించగా వారు పరిశీలించారు. బాధితుని ఖాతా నుంచి దేవ్‌సింగ్‌ అనే వ్యక్తి పేటీఎంకు 68,800 రూపాయలు విడతల వారీగా జమ అయినట్లు గుర్తించారు. దీంతో లబోదిబోమనడం నరేష్‌ వంతయింది. తన రెండు ఖాతాలు ఫోన్‌ పేతో అనుసంధానం అయి ఉన్నాయని, ఇదే అదనుగా నిందితుడు మోసానికి పాల్పడ్డాడంటూ లబోదిబోమంటూ నరేష్‌ బ్యాంకు అధికారులకు , పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  • Loading...

More Telugu News