Karnataka: రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు: కర్ణాటక ఎమ్మెల్యే
- కర్ణాటకలో ముదురుతున్న రాజకీయ సంక్షోభం
- రెబల్ ఎమ్మెల్యేల్లో పదిమంది ముంబైలోని స్టార్హోటల్లో మకాం
- సిద్ధరామయ్య సమావేశానికి వెళ్లేది లేదని స్పష్టీకరణ
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది. రాజీనామాలు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని రెబల్ ఎమ్మెల్యేలు భీష్మించుకున్నారు. తామందరం కలసికట్టుగా ఉన్నామని, రాజీనామాలను వెనక్కి తీసుకునే ఆలోచన లేదని రెబల్ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర తేల్చి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆధ్వర్యంలో మంగళవారం జరగనున్న కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి తాము హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. కాగా, శనివారం రాజీనామా చేసిన కాంగ్రెస్- జేడీఎస్ ఎమ్మెల్యేలు 13 మందిలో పదిమంది ప్రస్తుతం ముంబైలోని సోఫిటెల్ హోటల్లో ఉన్నారు.
మరోవైపు, సంక్షోభం నుంచి బయటపడేందుకు కాంగ్రెస్-జేడీఎస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తీరిక లేని సమావేశాలతో బిజీగా ఉన్నారు. కాగా, రాష్ట్రంలోని రాజకీయ సంక్షోభానికి బీజేపీయే కారణమని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. 13 నెలల కూటమి ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. పదిమంది రెబల్ ఎమ్మెల్యేలను ముంబైకి తరలించిన ప్రత్యేక చార్టర్డ్ విమానంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఉన్నారని, ఎమ్మెల్యేల రాజీనామా వెనక బీజేపీ కుట్ర ఉందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదని ఆరోపిస్తున్నారు.