Andhra Pradesh: అనంతపురంలో వ్యవసాయ అధికారుల నిర్లక్ష్య వైఖరి.. రోడ్డుపై బైఠాయించిన రైతులు!
- అనంతపురంలోని ఉరవకొండ మండలంలో ఘటన
- ఈరోజు విత్తనాలు పంపిణీ చేస్తామని ప్రకటన
- తీరా రైతులు వచ్చాక విత్తనాలు ఇంకా రాలేదని మొండిచేయి
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా రైతులు ఈరోజు మరోసారి ఉద్యమించారు. వేరుశనగ విత్తనాలు అందిస్తామని పిలిపించి, చివరికి స్టాక్ లేదని వ్యవసాయ అధికారులు చేతులు ఎత్తేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ఉరవకొండ మండలంలోని ఐదు గ్రామాల రైతులకు వేరుశనగ విత్తనాలను ఈరోజు పంపిణీ చేస్తామని వ్యవసాయ అధికారులు ప్రకటించారు. అందుకు అనుగుణంగా రైతులంతా వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి చేరుకున్నారు.
అయితే ఉదయం 10 గంటల సమయంలో కార్యాలయానికి వచ్చిన అధికారులు ఇంకా వేరుశనగ విత్తనాల స్టాక్ రాలేదనీ, వచ్చాక సమాచారం ఇస్తామని చెప్పారు. దీంతో రైతన్నల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమకు న్యాయం చేయాలంటూ ఐదు గ్రామాల రైతులు ఉరవకొండ-గుంతకల్ రహదారిపై గంటపాటు బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రైతులతో మాట్లాడారు. పోలీసులు శాంతింపజేయడంతో మెత్తబడ్డ రైతులు ఆందోళనను విరమించారు.