Galla: పొగాకు మద్దతుధర అంశాన్ని లోక్ సభలో లేవనెత్తిన గల్లా జయదేవ్
- పొగాకు రైతులను కేంద్రం ఆదుకోవాలి
- తక్కువ గ్రేడ్ పొగాకును కిలో రూ.90కి కూడా కొనడంలేదు
- ఎగుమతి ఆదేశాలను కేంద్రం నిర్ధారించాలి
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ రాష్ట్రంలో పొగాకు రైతుల ఇబ్బందులను లోక్ సభలో ప్రస్తావించారు. ఏపీలో పొగాకుకు మద్దతుధర కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఏపీలో కరవు కారణంగా ఈ ఏడాది తక్కువ గ్రేడ్ పొగాకు ఎక్కువగా పండిందని, ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని తెలిపారు. తక్కువ గ్రేడ్ పొగాకును కిలో రూ.90కి కూడా కొనడం లేదని, గతేడాది ఇదే రకం పొగాకును కిలో రూ.140కి కొనుగోలు చేశారని గల్లా జయదేవ్ గుర్తుచేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పొగాకు రైతులు అప్పుల్లో కూరుకుపోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఇప్పటివరకు పొగాకు ఎగుమతులకు ఆదేశాలు ఇవ్వలేదని, ఇది రైతుల్లో అభద్రత భావాన్ని పెంచుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో, పొగాకు అనుమతుల ఆదేశాలను నిర్ధారించాలని కోరారు.