Andhra Pradesh: టీడీపీ లాంటి దిక్కుమాలిన ప్రతిపక్షం ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా ఉండదు!: ఏపీ సీఎం జగన్
- ఏపీ విషయంలో కేసీఆర్ ఉదారంగా వ్యవహరించారు
- తెలంగాణతో సఖ్యతపై హర్షించకుండా విమర్శిస్తారా?
- అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీపై ముఖ్యమంత్రి విమర్శలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ప్రజల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రశంసించారు. ఆయనతో ఉన్న సత్సంబంధాల కారణంగానే గోదావరి నీళ్లను శ్రీశైలం, నాగార్జున సాగర్ కు తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వ్యాఖ్యానించారు.
‘ఇలాంటి పరిస్థితుల్లో, కేసీఆర్ తో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా హర్షించాల్సిందిపోయి ఏం మాట్లాడుతున్నారు? గోదావరి నీటిని మనం పోలవరం దిగువ నుంచి తీసుకోవడం లేదు. కేసీఆర్ ఈ నీళ్లను తన రాష్ట్రం నుంచి తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నారు. కేసీఆర్ ఔదార్యానికి (మేగ్నానిమిటీకి) సంతోషించాల్సింది పోయి మనం చేస్తున్నది ఏంటి అధ్యక్షా. గోదావరి గురించి మీకు క్లాస్ పీకుతా ఉండండి. గోదావరికి నాలుగు పాయలు. ఒకటి నాసిక్ నుంచి వస్తుంది. ఇది ఎప్పుడో ఎండిపోయింది.
రెండో పాయ ప్రాణహిత పాయ. దీని నుంచి 36 శాతం గోదావరికి నీళ్లు వస్తాయి. మూడోది ఇంద్రావతి పాయ. గోదావరి నీటిలో 26 శాతం నీరు దీని నుంచి వస్తుంది. ఈ రెండు పాయలు తెలంగాణలోనే ఉన్నాయి అధ్యక్షా. ఏపీలో ఉన్న శబరి పాయ 11 శాతం నీటిని అందిస్తుంది. మన కళ్ల ఎదుటన చంద్రబాబు ఉండగానే, కాళేశ్వరం 3 టీఎంసీల నీళ్లను తెలంగాణ తీసుకెళుతుంటే చంద్రబాబు ఏం చేశారు? పైన ఉండే రాష్ట్రాలు ఏం చేసినా కింద ఉండేవాళ్లు గొడవ చేయగలుగుతాం. కోర్టులకు పోగలుగుతాం. కానీ అవేవీ తెగవు అధ్యక్షా. పై రాష్ట్రాలవాళ్లు డ్యాములు కట్టుకుంటూ పోతూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉంటాం’ అన్నారు.
రాష్ట్రాల మధ్య, ముఖ్యమంత్రుల మధ్య సఖ్యతే ఇప్పుడు ముఖ్యమని జగన్ వ్యాఖ్యానించారు. ఆ పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టే కేసీఆర్ ఓ అడుగు ముందుకు వేశారనీ, తమ రాష్ట్రం నుంచి కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ కోసం చొరవ తీసుకున్నారని చెప్పారు. కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ ద్వారా మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని చెప్పారు. ఈ విషయంలో ఇరురాష్ట్రాల ఇంజనీర్లు కృషి చేస్తున్నారని సీఎం జగన్ తెలిపారు. ఈ విషయాన్ని అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నారంటే ఇంతకంటే దిక్కుమాలిన ప్రతిపక్షం ప్రపంచ చరిత్రలో ఏదీ ఉండదని విమర్శించారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు మారాలని ముఖ్యమంత్రి ఉద్బోధించారు.