Andhra Pradesh: సీఎం జగన్ వయసు నా రాజకీయ అనుభవమంత.. ఈ విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలి!: చంద్రబాబు
- కాళేశ్వరంపై ఇప్పుడే సీఎం మాట్లాడుతారనుకోలేదు
- ప్రజల సమస్యలను కూడా ముఖ్యమంత్రి పట్టించుకోవాలి
- మీరు గట్టిగా మాట్లాడితే మేం భయపడబోం
- అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడే సీఎం జగన్ ప్రస్తావిస్తారని తాను అనుకోలేదని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రిగా జగన్ రాష్ట్ర ప్రజల సమస్యలను కూడా పట్టించుకోవాలని సూచించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రిగారు ఈ ఇష్యూ(కాళేశ్వరం) మీద ఇప్పుడే స్పందిస్తారని నేను అనుకోలేదు.
ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీకు అవకాశం వచ్చింది. రాష్ట్ర సమస్యలు కూడా ఆలోచించాలి. నేను చెప్పాలంటే నా రాజకీయ అనుభవం అంత సుమారుగా మీ వయసు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి‘ అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలతో సీఎం జగన్ సహా పలువురు సభ్యుల ముఖాలపై నవ్వులు పూశాయి.
అన్నీ నాకు తెలుసు అని విర్రవీగడం కరెక్టు కాదని చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘అధ్యక్షా.. ఈరోజు మన రాష్ట్రం గురించి .. ముఖ్యమంత్రి గారు ఎంత ఈజీగా చెప్పేశారంటే. చాలా ఈజీగా చెప్పారు. కేసీఆర్ హిట్లర్. కాళేశ్వరం ప్రాజెక్టు వస్తే ఏపీ, తెలంగాణ ఇండియా-పాకిస్థాన్ అయిపోతాయని ఈ సీఎం గారు గతంలో అన్నారు. ఇప్పుడు ఆయన మాట మార్చుకున్నారు. ఈ రోజు ఇది సున్నితమైన సమస్య. నేను హెచ్చరిస్తున్నా. భావితరాల భవిష్యత్తును తాకట్టు పెట్టే అధికారం మీకు లేదు అని హెచ్చరిస్తున్నా’ అని చెప్పారు.
ఇంతలో అధికార పక్ష సభ్యులు గోలగోల చేయడంతో చంద్రబాబు సహనం కోల్పోయారు. ‘ఏం తమాషా చేస్తున్నారా మీరు? ఏం ఎగతాళి చేస్తున్నారా మీరు? అవమానించేదానికి సిద్ధపడతారా? మీరు ఏదో గట్టిగా మాట్లాడితే మేం భయపడం. మీరు చేసే చర్యలను ఐదు కోట్ల మంది ప్రజలు గమనిస్తున్నారు. ఆలోచిస్తున్నారు. మీరు నా నోరు అసెంబ్లీలో మూయించగలరు గానీ బయట మూయించలేరు. మీరు గుర్తుంచుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.