Tamil Nadu: రూ.4 లకు కక్కుర్తి పడిన హోటల్ యజమానికి రూ.15 వేలు వదిలింది
- పెరుగుపై జీఎస్టీ వేసిన వ్యాపారి
- ఫోరాన్ని ఆశ్రయించిన వినియోగదారుడు
- రూ.10 వేల జరిమానా, ఖర్చులకు మరో రూ.5 వేలు చెల్లించాలని ఆదేశం
ఓ హోటల్ వ్యాపారి అత్యుత్సాహానికి, అత్యాశకు పోయి రెండు రూపాయలకు కక్కుర్తిపడితే పదిహేను వేల రూపాయల చేతి చమురు వదిలింది. పెరుగు కప్పు కొన్న వినియోగదారుడి వద్ద నుంచి జీఎస్టీ వసూలు చేయడంతో వినియోగదారుల ఫోరం అతనికి భారీ మొత్తంలో జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే...ఈ ఏడాది ఫిబ్రవరి 6న మహారాజన్ అనే వ్యక్తి తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలిలోని ఓ హోటల్‌కు వెళ్లాడు. పెరుగు ప్యాకెట్ అడిగాడు. వ్యాపారి పెరుగు ఖరీదు 40 రూపాయలు, జీఎస్టీ 2 రూపాయలు, ప్యాకింగ్ ఖరీదు 2 రూపాయలు కలిపి మొత్తం 44 రూపాయలు అతని వద్ద వసూలు చేసి బిల్లు ఇచ్చాడు. అయితే 'పాలు, పెరుగు, కూరగాయలను జీఎస్టీ నుంచి మినహాయించారు కదా' అని సదరు వినియోగదారుడు వ్యాపారిని ప్రశ్నించినా అతను నిర్లక్ష్యంగా పట్టించుకోలేదు.
దీంతో బాధితుడి తరపున న్యాయవాది బ్రహ్మం తిరునల్వేలి జిల్లా వినియోగదారుల ఫోరంలో పిటిషన్ వేశారు. ఈ కేసులో వాణిజ్య విభాగం అధికారులను న్యాయస్థానం విచారించగా పెరుగుపై జీఎస్టీ లేదని, ప్యాకింగ్‌కు కూడా ఎటువంటి రుసుము వసూలు చేయకూడదని తెలియజేశారు. దీంతో న్యాయమూర్తి వినియోగదారుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు.
పెరుగు కొనేందుకు వచ్చిన అతనికి మనోవేదన కలిగించినందుకు రూ.10 వేలు, కోర్టు ఖర్చుల కింద మరో రూ.5 వేలు, జీఎస్టీ, పార్సిల్ కోసం అతని వద్ద నుంచి వసూలు చేసిన రూ.4 కలిపి మొత్తం 15,004 రూపాయలు వినియోగదారునికి చెల్లించాలని హోటల్ యజమానిని న్యాయమూర్తి దేవదాస్, సభ్యులు శివమూర్తి, ముత్తులక్ష్మిలు తీర్పులో ఆదేశించారు. సకాలంలో డబ్బు చెల్లించని పక్షంలో ఆరు శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని తీర్పు చెప్పారు.