Andhra Pradesh: బాలికలను చదువులో ప్రోత్సహించి, ఆత్మవిశ్వాసం నింపేందుకే రాజన్న బడిబాట చేపట్టాం!: మంత్రి వెల్లంపల్లి
- విజయవాడలో రాజన్న బడిబాటలో పాల్గొన్న మంత్రి
- 9, 10వ తరగతి అమ్మాయిలకు సైకిళ్ల పంపిణీ
- రవాణా సౌకర్యం లేక విద్యార్థులు చదువు మానేస్తున్నారన్న మంత్రి వెల్లంపల్లి
బాలికలను చదువులో ప్రోత్సహించి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు రాజన్న బడిబాట కార్యక్రమం చేపట్టామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడ వన్ టౌన్ లోని కౌతు సుబ్బారావు నగరపాలక పాఠశాలలో 9, 10వ తరగతి చదువుతున్న బాలికలకు మంత్రి సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బ్యాగులను అందించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చాలాచోట్ల రవాణా సదుపాయం లేకపోవడంతో విద్యార్థులు స్కూళ్లకు రావడం మానేస్తున్నారని తెలిపారు. దీన్ని గుర్తించిన వైసీపీ ప్రభుత్వం రాజన్న బడిబాట కార్యక్రమం ద్వారా సైకిళ్లను పంపిణీ చేస్తోందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ, విద్యలో రాణించి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రిని విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.