Andhra Pradesh: విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయండి.. రాష్ట్రపతికి టీడీపీ ఎంపీల లేఖ!
- విజయసాయిరెడ్డి ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు
- ఎంపీగా ఉంటూ ఆ పదవి చేపట్టడం రాజ్యాంగ ఉల్లంఘనే
- రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 కింద వేటు వేయండి
టీడీపీ లోక్ సభ సభ్యులు ఈరోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని అందులో కోరారు. విజయసాయిరెడ్డిని వైసీపీ ప్రభుత్వం ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించిందనీ, ఇది ఆర్టికల్ 102 కింద రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఈ ఆర్టికల్ కింద లాభదాయక పదవిని చేపడితే రాజ్యసభ సభ్యత్వానికి అనర్హుడు అవుతారని చెప్పారు.
కొన్నిరోజుల క్రితం విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా ప్రభుత్వం నియమించింది. అనంతరం కొద్దిరోజులకే దానిని రద్దు చేసి, ప్రత్యేక ప్రతినిధి పదవి లాభదాయక హోదా కిందకు రాదని ఆర్డినెన్స్ జారీచేసింది. అనంతరం తిరిగి విజయసాయిని ఆ పదవిలో నియమించారు. టీడీపీ నేతలు తాజాగా దీనిపైనే రాష్ట్రపతి కోవింద్ కు లేఖ రాశారు.