Alex Carey: రక్తం కారుతున్నా అలాగే బ్యాటింగ్ చేసిన ఆసీస్ వికెట్ కీపర్
- ఆర్చర్ బంతికి గాయపడిన అలెక్స్ కేరీ
- గడ్డానికి లోతుగా దెబ్బ
- తలమీదుగా పెద్ద కట్టు కట్టించుకున్న కేరీ
ఇంగ్లాండ్ తో బర్మింగ్ హామ్ లో జరుగుతున్న ప్రపంచకప్ సెమీస్ లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేస్తోంది. అయితే, ఇంగ్లాండ్ పేసర్ ఆర్చర్ విసిరిన ఓ బంతికి ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అలెక్స్ కేరీ గాయపడ్డాడు. పిచ్ పై పడిన వెంటనే ఉవ్వెత్తున ఎగసిన ఆ బంతి నేరుగా కేరీ గడ్డానికి తగిలింది. బంతి ధాటికి కేరీ హెల్మెట్ కూడా ఊడిపోయింది. అయితే, ఆ గాయానికి డ్రెస్సింగ్ చేయించుకున్న ఆసీస్ వికెట్ కీపర్ బ్యాటింగ్ కొనసాగించాడు.
కానీ ఆ గాయం బాగా లోతుగా తగలడంతో రక్తస్రావం అవుతూనే ఉండడంతో మరోసారి మెడికల్ టీమ్ ను మైదానంలోకి పిలిపించుకున్న కేరీ తలమీదుగా పెద్ద కట్టు కట్టించుకున్నాడు. అయినప్పటికీ రక్తం కారుతూనే ఉన్నా మొండిపట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. అప్పట్లో అనిల్ కుంబ్లే వెస్టిండీస్ తో టెస్టు మ్యాచ్ లో తలకు కట్టుతో ఇలాగే ఆడి పోరాటపటిమను చాటిన సంఘటన కేరీ గాయంతో మళ్లీ అందరూ జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. కాగా, కేరీ 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అదిల్ రషీద్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.
ప్రస్తుతం ఆసీస్ స్కోరు 28 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు. ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ ఒకే ఓవర్లో కేరీ, స్టొయినిస్ లను అవుట్ చేసి ఆసీస్ ను దెబ్బకొట్టాడు. ప్రస్తుతం క్రీజులో స్టీవ్ స్మిత్ 50 పరుగులతో ఆడుతున్నాడు. స్టొయినిస్ అవుట్ కావడంతో మ్యాక్స్ వెల్ వచ్చాడు.