Andhra Pradesh: రూ 2.28 లక్షల కోట్ల భారీ బడ్జెట్... ఏపీ కేబినెట్ ఆమోదం!
- రూ. 2,27,984 లక్షల కోట్లతో భారీ బడ్జెట్
- మధ్యాహ్నం 12.22 గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టనున్న బుగ్గన
- శాసనమండలిలో ప్రవేశపెట్టనున్న పిల్లి సుభాష్ చంద్రబోస్
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఈరోజు ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. రూ. 2,27,984 కోట్ల భారీ బడ్జెట్ కు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ ఉదయం ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమైంది. దాదాపు 45 నిమిషాల పాటు బడ్జెట్ పై చర్చ జరిగింది. సమావేశానంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, బడ్జెట్ లో నవరత్నాలకు ప్రాధాన్యతను ఇచ్చామని తెలిపారు.
షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నప్పటికీ... సున్నా వడ్డీ రుణాలపై చర్చ నేపథ్యంలో సమయాన్ని మార్చారు. మధ్యాహ్నం 12.22 గంటలకు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శాసనమండలిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్ ను శాసనసభలో బొత్స సత్యనారాయణ, మండలిలో మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెడతారు.