Andhra Pradesh: బుగ్గన ప్రవేశపెట్టిన ఏపీ బడ్జెట్ పై మాజీ ఆర్థికమంత్రి యనమల వ్యాఖ్యలు
- ప్రచారం ఎక్కువ పస తక్కువ
- సున్నా వడ్డీపై గగ్గోలు పెట్టి ఇప్పుడు రూ.100 కోట్లేనా?
- వైఎస్సార్, జగన్ తప్ప పథకాలకు వేరే పేర్లేవీ లేవా?
ఏపీ అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బడ్జెట్ పై మాజీ ఆర్థికమంత్రి, టీడీపీ అగ్రనేత యనమల రామకృష్ణుడు విమర్శనాత్మక రీతిలో స్పందించారు. బడ్జెట్ లో పేర్కొన్న ప్రతి పథకానికి వైఎస్సార్, జగన్ తప్ప మరో పేరులేదని అన్నారు. కనీసం కొన్ని పథకాలకైనా మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, కందుకూరి వీరేశలింగంల పేర్లు పెట్టివుంటే బాగుండేదని యనమల అభిప్రాయపడ్డారు.
దశ ఉన్నా కానీ దిశ లేని జగన్ సర్కారు ఎన్నికల హామీలను బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం దారుణమని నిలదీశారు. సున్నా వడ్డీపై అసెంబ్లీలో గగ్గోలు పెట్టిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు రూ.100 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. చివరికి సాంఘిక సంక్షేమానికి నిధులు తగ్గించారని, నీటిపారుదల శాఖకు నిధులు కోత పెట్టారని ఆరోపించారు. మొత్తమ్మీద ఏపీ బడ్జెట్ లో ప్రచారం ఎక్కువ, పస తక్కువగా కనిపిస్తోందని పెదవి విరిచారు.