Sanjay Bangar: వరల్డ్ కప్ ఓటమి పర్యవసానం.... టీమిండియా బ్యాటింగ్ కోచ్ మెడపై కత్తి!
- వరల్డ్ కప్ తో ముగిసిన సంజయ్ బంగర్ కాంట్రాక్టు
- పొడిగించేందుకు బోర్డు విముఖత
- వరల్డ్ కప్ సెమీస్ లో కొట్టొచ్చినట్టు కనిపించిన బ్యాటింగ్ వైఫల్యం
వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి నేపథ్యంలో టీమిండియాను ప్రక్షాళన చేసే దిశగా బీసీసీఐ ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్ తో కాంట్రాక్టు ముగించుకున్న బోర్డు, తాజాగా జట్టు బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పై దృష్టి పెట్టింది. వరల్డ్ కప్ నుంచి భారత జట్టు నిష్క్రమణకు ప్రధానంగా బ్యాటింగ్ వైఫల్యమే కారణం కావడంతో బంగర్ పనితీరుపై బోర్డు అధికారులు సమీక్ష చేపట్టినట్టు తెలుస్తోంది.
టీమిండియా కోచింగ్ స్టాఫ్ లో బంగర్ గత కొన్నేళ్లుగా కీలకంగా ఉన్నాడు. గత ఏడాదిగా బంగర్ పనితీరుపై విమర్శలు తప్పడంలేదు. అదే సమయంలో, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ నేతృత్వంలో టీమిండియా బౌలర్లు ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ దళంగా పేరుతెచ్చుకున్నారు. ఫీల్డింగ్ లోనూ ఆర్.శ్రీధర్ శిక్షణలో ఎంతో మెరుగయ్యారు. కానీ బ్యాటింగ్ విభాగంలో మాత్రం ఎక్కడి లోపాలు అక్కడే ఉండిపోయాయి.
ఇప్పటికీ నాలుగో స్థానంలో ఆడే ఆటగాడు టీమిండియాలో లేడు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ ఆడే స్థానాలు తప్ప బ్యాటింగ్ ఆర్డర్ లో ఇప్పటికీ స్థిరత్వం లేదు. ఆ ముగ్గురూ తప్ప మిగతావాళ్లు ఏ స్థానంలో బ్యాటింగ్ కు వెళ్లాలన్నది మ్యాచ్ పరిస్థితులను బట్టి నిర్ణయించేవాళ్లు. వీటిలో కొన్ని సంజయ్ బంగర్ పరిధిలోకి వచ్చే విషయాలు కాకపోయినా, బ్యాటింగ్ కోచ్ గా అతడ్నే బాధ్యుడ్ని చేస్తున్నట్టు తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఈ వరల్డ్ కప్ తో బంగర్ కాంట్రాక్టు ముగిసింది. బోర్డు అధికారులు చెబుతున్న విషయాల ద్వారా, బంగర్ తో ఒప్పందాన్ని పొడిగించకపోవచ్చని సమాచారం.