Vulture: రాబందుల కోసం మహారాష్ట్ర వైపు చూస్తున్న తెలంగాణ సర్కారు
- విపరీతంగా పడిపోతున్న రాబందుల సంఖ్య
- సంతానోత్పత్తి కేంద్రాల్లో రాబందుల సంఖ్య పెంచేందుకు ఏర్పాట్లు
- 10 రాబందులు కావాలంటూ మహారాష్ట్రకు ప్రతిపాదనలు పంపిన తెలంగాణ అటవీశాఖ
తెలంగాణ అటవీశాఖ తమకు 10 వైట్ బ్యాక్డ్ రాబందులు పంపించాలంటూ మహారాష్ట్రలోని గడ్చిరోలి రాబందుల సంరక్షణ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ఉన్న రాబందుల సంతానోత్పత్తి కేంద్రంలో ప్రస్తుతం 12 వైట్ బ్యాక్డ్ రాబందులు ఉన్నాయి. అయితే వాటిలో చాలావరకు 35 ఏళ్ల వయసున్న రాబందులే. సాధారణంగా రాబందుల జీవనకాలం 40 నుంచి 45 సంవత్సరాల వరకు ఉంటుంది. రాబందుల సంతతి మరింత అభివృద్ధి చెందాలంటే మరికొన్ని జతల ఆరోగ్యకరమైన రాబందులు అవసరమని హైదరాబాద్ లోని రాబందుల కేంద్రం అధికారులు భావిస్తున్నారు.
గత కొన్ని దశాబ్దాలుగా భారత్ లో రాబందుల సంఖ్య వేగంగా పడిపోతోంది. రాబందులు కనిపిస్తే సమాచారం అందించినవారికి భారీ ఎత్తున నజరానా కూడా ప్రకటించారు. పశు కళేబరాలను తినే సమయంలో ఆ మాంసంలో ఉండే డైక్లోఫెనాక్ అవశేషాలు రాబందుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దాంతో రాబందుల జాతి అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేరింది.