Rayudu: అంబటి రాయుడ్ని వరల్డ్ కప్ కు ఎంపిక చేయకపోవడం సరైన నిర్ణయమే: బీసీసీఐ మాజీ కార్యదర్శి
- రాయుడికి బోర్డు ఎన్నో అవకాశాలు ఇచ్చిందన్న సంజయ్ జగ్దాలే
- సద్వినియోగం చేసుకోలేకపోయాడంటూ విమర్శ
- ఐపీఎల్ ప్రదర్శన ప్రామాణికం కాదంటూ స్పష్టీకరణ
ప్రపంచకప్ లో టీమిండియా ఓటమి నేపథ్యంలో అంబటి రాయుడు వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అయింది. మిడిలార్డర్ లో స్పెషలిస్టు బ్యాట్స్ మన్ లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించిందని మాజీలు విమర్శలు చేస్తున్న తరుణంలో రాయుడు జట్టులో ఉంటే బ్యాటింగ్ లైనప్ సమతుల్యంగా ఉండేదన్న అభిప్రాయాలు బలంగానే వినిపిస్తున్నాయి. అయితే, అంబటి రాయుడ్ని ప్రపంచకప్ కు ఎంపిక చేయకపోవడం సరైన నిర్ణయమేనని బీసీసీఐ మాజీ కార్యదర్శి సంజయ్ జగ్దాలే అంటున్నారు.
రాయుడు, దినేశ్ కార్తీక్ వంటి ఆటగాళ్లకు బోర్డు ఎన్నో అవకాశాలు ఇచ్చినా, వాళ్లు ఉపయోగించుకోలేకపోయారని తెలిపారు. ఐపీఎల్ లో కొందరి ప్రదర్శన బాగా ఉండొచ్చేమో కానీ, టీమిండియా ఎంపికకు ఐపీఎల్ ప్రదర్శన ప్రామాణికం కాబోదని స్పష్టం చేశారు. రాయుడ్ని ఎంపిక చేయకపోవడంలో సెలక్టర్లు, టీమ్ మేనేజ్ మెంట్ పశ్చాత్తాప పడాల్సిన అవసరంలేదని జగ్దాలే అన్నారు. శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే వంటి ఆటగాళ్లు టీమిండియాలో అవకాశాలు దక్కించుకోలేకపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.