Rajasthan: మహిళను దారుణంగా హింసించి సామూహిక అత్యాచారం.. రాజస్థాన్ పోలీసుల అకృత్యం
- లాకప్ డెత్‌ను కళ్లారా చూసిన మహిళ
- బయటపెడుతుందన్న ఉద్దేశంతో చిత్ర హింసలు
- ఆపై సామూహిక అత్యాచారం
మహిళను దారుణంగా హింసించిన పోలీసులు ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన రాజస్థాన్‌లోని చురు జిల్లాలో జరిగింది. ఈ నెల 6న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. దొంగతనం ఆరోపణలతో నేమిచంద్ (22) అనే వ్యక్తిని గత నెల 30న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 6న అతడి ఇంటికి వెళ్లిన పోలీసులు నిందితుడి వదినను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా, విచారణ సందర్భంగా నేమిచంద్‌ను పోలీసులు తీవ్రంగా హింసించారు. వారు కొట్టిన దెబ్బలకు తాళలేక బాధితుడు కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయాడు.
నేమిచంద్ తన కళ్లముందే చనిపోవడంతో ఆమె ఈ విషయాన్ని ఎక్కడ బయటపెడుతుందోనని పోలీసులు భయపడ్డారు. దీంతో ఆమెను తీవ్రంగా హింసించారు. ఆమె గోళ్లు పీకేశారు. కను రెప్పలు కూడా తెరవలేనంత తీవ్రంగా కొట్టారు. నిస్సహాయురాలిగా పడివున్న ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఫిర్యాదు మేరకు ఆరుగురు పోలీసులపై ఆదివారం కేసులు నమోదయ్యాయి. స్థానికంగా సంచలనమైన ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.