Vizag: సింహాచలంలో గిరి ప్రదక్షిణ ప్రారంభం.. పది లక్షల మంది భక్తులు రావొచ్చని అంచనా!
- తొలి పావంచా వద్ద పండితుల ప్రత్యేక పూజలు
- పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అశోక్ గజపతి రాజు కుమార్తె
- భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసిన దేవస్థానం
విశాఖపట్టణం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా తొలి పావంచా వద్ద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త, టీడీపీ నేత అశోక్ గజపతి రాజు కుమార్తె అదితి గజపతిరాజు పాల్గొన్నారు.
సింహాచలం కొండల చుట్టూ 32 కిలో మీటర్ల మేర భక్తులు గిరి ప్రదక్షిణం చేయనున్నారు. ఈ గిరి ప్రదక్షిణలో సుమారు పది లక్షల మంది భక్తులు పాల్గొంటారని ఆలయ అధికారుల అంచనా. భక్తుల కోసం పలుచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. తాగునీరు, ప్రసాద వితరణ నిమిత్తం దేవస్థానం ఏర్పాట్లు చేసింది.
ఇదిలా ఉండగా, గిరి ప్రదక్షిణ చేసేందుకు వస్తున్న భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. గిరి ప్రదక్షిణ జరిగే మార్గంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించే నిమిత్తం విశాఖ నగరంలోకి భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు.