Vijayawada: వ్యాపారి రాం ప్రసాద్ హత్య కేసులో ప్రధాన సూత్రధారి కోగంటి సత్యం: డీసీపీ శ్రీనివాస్
- గతంలో రాంప్రసాద్, కోగంటి కలిసి వ్యాపారం చేశారు
- కోగంటికి రూ.70 కోట్లు రాంప్రసాద్ బకాయిపడ్డాడు
- రూ.23 కోట్లు చెల్లించాల్సిందిగా సెటిల్ చేశారు
- సెటిల్ చేసిన మొత్తాన్ని రాంప్రసాద్ చెల్లించలేదు
హైదరాబాద్ లోని పంజాగుట్టలో ప్రముఖ వ్యాపారి రాంప్రసాద్ హత్య సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ హత్యకు పాల్పడింది తామే నంటూ ముగ్గురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం కోగంటి సత్యం కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాలను పశ్చిమ మండలం డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.
హైదరాబాద్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2003లో రాంప్రసాద్ , కోగంటి సత్యం ఇధ్దరూ కలిసి వ్యాపారం చేశారని చెప్పారు. వ్యాపారలావాదేవీల్లో భాగంగా కోగంటికి రూ.70 కోట్లను రాంప్రసాద్ బకాయిపడ్డాడని అన్నారు. ఈ నేపథ్యంలో వారి మధ్య వివాదం తలెత్తడంతో, పెద్దమనుషుల వద్దకు వెళితే, కోగంటికి రూ.23 కోట్లు చెల్లించాల్సిందిగా సెటిల్ చేశారని అన్నారు. అయినప్పటికీ, సెటిల్ చేసిన బకాయిని రాంప్రసాద్ చెల్లించలేదని, దీంతో, రాంప్రసాద్ పై కోగంటి ఆగ్రహంతో ఉన్నాడని అన్నారు. ఈ నేపథ్యంలోనే రాంప్రసాద్ ను హత్య చేయించాలనే నిర్ణయానికి వచ్చాడని తెలిపారు.
రాంప్రసాద్ ను హత్య చేసింది ఎవరైనప్పటికీ, ఈ కేసులో ప్రధాన సూత్రధారి కోగంటి సత్యమేనని అన్నారు. కోగంటితో గొడవల వల్లే రామ్ ప్రసాద్ విజయవాడ వదిలి హైదరాబాద్ కు వచ్చారని చెప్పారు. రాం ప్రసాద్ హత్యకు రూ.10 లక్షల సుపారీ ఇచ్చేందుకు కోగంటి సత్యం ఒప్పుకున్నట్టు తమ విచారణలో తెలిసిందని వివరించారు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు కోగంటి యత్నించాడని అన్నారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఆరుగురు నిందితుల్లో కోగంటి సత్యం, శ్యామ్, ప్రసాద్, ప్రీతమ్, రామును అరెస్టు చేశామని చెప్పారు.