Asaduddin Owaisi: అమిత్ షా మంత్రి మాత్రమే.. దేవుడు కాదు: అసదుద్దీన్ ఒవైసీ
- మక్కా మసీదు పేలుళ్లను ప్రస్తావించిన ఎంపీ సత్యపాల్ సింగ్
- అడ్డు తగిలిన అసదుద్దీన్
- వినడం నేర్చుకోవాలంటూ షా చురక
కేంద్ర మంత్రి అమిత్ షాపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మంత్రి మాత్రమేనని, దేవుడు కాదని చురకలంటించారు. బీజేపీ నిర్ణయాలను వ్యతిరేకించేవారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. వేలు చూపించి మరీ ప్రతిపక్ష పార్టీ నేతలను హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సవరణ బిల్లు సందర్భంగా లోక్‌సభలో సోమవారం జరిగిన చర్చ సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ మాట్లాడుతుండగా అసద్ మాట్లాడే ప్రయత్నం చేశారు. వెంటనే స్పందించిన అమిత్ షా తొలుత సభ్యుల ప్రసంగాన్ని వినాలని అసద్‌కు సూచించారు. సత్యపాల్ సింగ్ మాట్లాడుతూ.. మాలెగావ్ పేలుళ్ల గురించి మాట్లాడాల్సి వస్తే తాను హైదరాబాద్ గురించి కూడా మాట్లాడగలనని, అక్కడి కేసుల గురించి కూడా తాను మాట్లాడగలనని అన్నారు.
మక్కా మసీదు పేలుళ్ల కేసును దర్యాప్తు చేస్తున్న పోలీస్ కమిషనర్ అనుమానిత మైనారిటీ వ్యక్తులను అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి ఆయనను తీవ్రంగా హెచ్చరించారని ఎంపీ పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి పనులు చేస్తే ఉద్యోగం ఊడిపోతుందని హెచ్చరించారని సత్యపాల్ సింగ్ అన్నారు. దీంతో స్పందించిన అసద్.. పోలీస్ కమిషనర్‌తో జరిగిన సంభాషణను సభ ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.
దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. దీనికి స్పందించిన షా మాట్లాడుతూ.. సభలోని సభ్యులు మాట్లాడుతున్నప్పుడు వినడం నేర్చుకోవాలంటూ అసద్‌కు సూచించారు. ఎంపీ ఎన్నో విషయాలను ప్రస్తావించారని, తాము సహనంగా విన్నామని షా అన్నారు. మీరు కూడా వినడాన్ని అలవాటు చేసుకోవాలని అసద్‌కు సూచించారు.