Teja: దర్శకత్వం వైపుకు రావడానికి అదే కారణం: తేజ
- కెమెరా మెన్ గా మంచి పేరు వచ్చింది
- దర్శకులకు అందే పారితోషికం ఎక్కువ
- 'చిత్రం' సినిమాతో హిట్ కొట్టేశాను
దర్శకుడు కాకముందే సినిమాటోగ్రఫర్ గా తేజకి మంచి పేరు వుంది. కెమెరా పైనే కాదు .. స్క్రిప్ట్ పై కూడా ఆయనకి మంచి పట్టు వుంది. 30కి పైగా బాలీవుడ్ సినిమాలకి ఆయన సినిమాటోగ్రఫర్ గా వ్యవహరించారు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, "కెమేరామెన్ గా మంచి పేరు వచ్చింది. కొంతమంది బాలీవుడ్ దర్శకులు నాపై నమ్మకంతో నాకు కొన్ని సీన్స్ ను అప్పగించేసి వెళ్లిపోయేవారు.
అలా ఒక దర్శకుడు ఒక సినిమా దర్శకత్వాన్ని చాలావరకూ నాకే వదిలేశాడు. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా హిట్ అయిన తరువాత నా పారితోషికం 8 లక్షల నుంచి 9 లక్షలకి వెళ్లింది. ఆ దర్శకుడి పారితోషికం దాదాపు 39 లక్షలు పెరిగింది. దాంతో దర్శకత్వం వైపుకు వెళ్లడమే మంచిదనిపించింది. 'చిత్రం' సినిమాతో దర్శకుడిగా తొలి హిట్ పడింది" అని చెప్పుకొచ్చారు.