Jagan: అమరావతిలో టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయం పనులను వెంటనే నిలిపివేయాలి!: బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి
- భక్తుల మనోభావాలను జగన్ దెబ్బతీస్తున్నారు
- బ్రేకు దర్శనాలను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నాం
- వీఐపీలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే వారి ప్రివిలేజ్ లను ఉపయోగించుకోవాలి
అమరావతిలో టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. క్యాంపు కార్యాలయం పనులను వెంటనే నిలిపివేయకపోతే భక్తులతో కలసి, పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ముగ్గురు ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో టీటీడీలో పాలనాపరమైన పనులు జరుగుతుంటాయని భానుప్రకాశ్ తెలిపారు. ఈ పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనేదే ధర్మకర్తల మండలి బాధ్యత అని... ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ గుర్తుంచుకోవాలని సూచించారు. కేటగిరీ బ్రేకు దర్శనాలను రద్దు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. కేటగిరీ దర్శనాల స్థానంలో తిరిగి అర్చనానంతర దర్శనాన్ని ప్రవేశపెడితే తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. వీఐపీలు కూడా ఏడాదికి ఒక్కసారి మాత్రమే తమ ప్రివిలేజ్ లను ఉపయోగించుకోవాలని... తద్వారా సామాన్య భక్తులకు సహకరించాలని విన్నవించారు.