Telugudesam: టీడీపీ నేతలు వారి మేనిఫెస్టోను టిష్యూ పేపర్ లా భావించారు: అంబటి రాంబాబు విమర్శలు
- టీడీపీలా మాది కులపిచ్చి పార్టీ కాదు
- వైసీపీ ఉన్నంత వరకూ టీడీపీ అధికారంలోకి రాలేదు
- తుని ఘటనపై విచారణ జరపాలని సీఎంను కోరుతున్నా
తమ మేనిఫెస్టోను బడ్జెట్ లో పొందుపరిచామని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చలో భాగంగా ఈరోజు ఆయన మాట్లాడుతూ, టీడీపీ నేతలు వారి మేనిఫెస్టోను టిష్యూ పేపర్ లా భావించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీలా తమది కులపిచ్చి పార్టీ కాదని, వైసీపీ ఉన్నంత వరకూ టీడీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ధీమా వ్యక్తం చేశారు.
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై, ఇప్పుడు జగన్ పై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అన్ని వర్గాలకు సీఎం జగన్ ప్రాధాన్యత కల్పిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తామని ప్రకటించిన మేరకు, జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న మూడో రోజు నుంచే బెల్ట్ షాపులను తొలగించామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా బెల్ట్ షాపులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.
నాడు సీఎంగా ఎన్టీఆర్ మద్యపాన నిషేధం అమలు చేస్తే, ఆ తర్వాత సీఎం అయిన చంద్రబాబు ఆ నిషేధం తొలగించారని విమర్శించారు. ఈ సందర్భంగా కాపుల అంశం ప్రస్తావిస్తూ, బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు వారిని మోసం చేశారని అన్నారు. బాబు హయాంలో కాపులను అరెస్టు చేసి జైల్లో పెట్టారని విమర్శించారు. కాపు కులస్తులను దశల వారీగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. తుని ఘటనలో తమపైనే కేసులు పెట్టారని, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ ఒక్కరిని కూడా విచారించలేదని, ఈ ఘటనపై విచారణ చేయించాలని సీఎం జగన్ ను కోరుతున్నానని అన్నారు.