Nirmala Sitharaman: ప్రజలను మభ్యపెట్టొద్దని జగన్‌కు విజ్ఞప్తి చేస్తున్నా: పురందేశ్వరి
- చంద్రబాబు, జగన్ ఒకేలా ప్రవర్తిస్తున్నారు
- జగన్ హోదా అంశాన్ని ప్రస్తావించడం సరికాదు
- గోదావరి జలాల విషయంలో ఏకపక్ష వైఖరి సరికాదు
హోదా ఇవ్వడం సాధ్యపడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినప్పటికీ పదే పదే జగన్ హోదా అంశాన్ని ప్రస్తావించడం సరికాదని బీజేపీ నేత పురందేశ్వరి పేర్కొన్నారు. హోదా విషయంలో ఇక మీదట జగన్ ప్రజలను మభ్యపెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు ఎన్నికలకు ముందు మాట మార్చారని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఎలాగైతే ప్రవర్తించారో, ప్రస్తుతం జగన్ కూడా అలాగే ప్రవర్తిస్తున్నారని పురందేశ్వరి ఆరోపించారు. తెలంగాణతో గోదావరి జలాల పంపకం విషయంలో ఏపీలోని అన్ని వర్గాల్లో ఆందోళన నెలకొని ఉందని చెబుతూ, ఈ విషయమై జగన్ ఏకపక్ష వైఖరిని ఆమె తప్పుబట్టారు. అవినీతి పరులంతా రక్షణ కోసమే బీజేపీలో చేరుతున్నారని వ్యాఖ్యానించడం సరికాదని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని, వారి విషయంలో దాని పని అది చేసుకుపోతుందని పురందేశ్వరి స్పష్టం చేశారు.