Andhra Pradesh: కేంద్రం లేఖలు రాసినా పీపీఏలపై సమీక్షలు ఆగవు: మంత్రి శ్రీరంగనాథరాజు
- గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది
- విద్యుత్ ఉత్పత్తి కాకుండానే చాలా డబ్బు దోచేశారు
- ప్రభుత్వ సొమ్ము ఆదా చేయడమే పీపీఏ సమీక్ష ఉద్దేశం
ఏపీలో గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) జోలికి వెళ్లొద్దని కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఈ విషయమై రాష్ట్ర మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ, కేంద్రం లేఖలు రాసినా సమీక్షలు ఆగవని అన్నారు. గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, విద్యుత్ ఉత్పత్తి కాకుండానే చాలా డబ్బు దోచేశారని ఆరోపించారు. ప్రభుత్వ సొమ్ము ఆదా చేయడమే పీపీఏ సమీక్ష ఉద్దేశమని చెప్పారు. అవినీతిని అరికట్టడం చాలా కష్టమని, దీన్ని అరికట్టాలంటే చాలా శక్తులతో పోరాడాలని అన్నారు. ఈ సందర్భంగా కాపుల గురించి ఆయన మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం కాపులకు చేసింది శూన్యమని, వారికి వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పి ఇవ్వలేదని విమర్శించారు. కాపు కార్పొరేషన్ నిధులను కచ్చితంగా ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు.