India: టీమిండియా కోచ్ రేసులో హేమాహేమీలు!
- వరల్డ్ కప్ తో ముగిసిన రవిశాస్త్రి కాలపరిమితి
- కొత్త కోచ్ కోసం బీసీసీఐ ప్రకటన
- త్వరలోనే నియామకం
ఈ వరల్డ్ కప్ తో టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి, ఇతర కోచింగ్ సిబ్బంది కాలపరిమితి ముగియడంతో కొత్త సిబ్బంది కోసం బీసీసీఐ ప్రకటన జారీచేయడం తెలిసిందే. ఈసారి వయసు నిబంధనతో పాటు అనుభవం విషయాన్ని కూడా బోర్డు స్పష్టంగా పేర్కొంది. నిబంధనల విషయం అటుంచితే, ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు కాబట్టి పారితోషికం కూడా ఆ స్థాయిలోనే ఉంటుందని అందరూ భావిస్తుంటారు. ఎప్పట్లాగానే, బీసీసీఐ కోచ్ ల కోసం ప్రకటన ఇవ్వగానే హేమాహేమీలు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఇంగ్లాండ్ తొలిసారి ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఆ జట్టు కోచ్ ట్రెవర్ బేలిస్ పేరు కూడా టీమిండియా కోచ్ రేసులో బలంగా వినిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ లో బేలిస్ పేరు పెద్దగా వినిపించకపోయినా, కోచ్ గా మాత్రం తలపండిపోయాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ ప్రపంచవిజేతగా అవతరించడంతో బేలిస్ పేరు మార్మోగిపోతోంది.
ఇక, ఆస్ట్రేలియా జాతీయుడు టామ్ మూడీ కూడా కోచ్ బరిలో నిలిచాడు. గతంలో రవిశాస్త్రితో పోటీలో తృటిలో కోచ్ పదవిని మిస్సయ్యాడు. క్రికెటర్ గా అనుభవం, ఒత్తిడిలో సైతం ప్రశాంతంగా ఉండే గుణాలు టామ్ మూడీ ప్రత్యేకతలు. ఐపీఎల్ లో సుదీర్ఘకాలంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కు కోచ్ గా సేవలందిస్తుండడం మూడీకి అదనపు అర్హత.
భారత్ కు విధ్వంసకర బ్యాటింగ్ ను పరిచయం చేసిన వీరేంద్ర సెహ్వాగ్ కూడా జాతీయ జట్టు కోచ్ రేసులో నిలిచాడు. 2017లో కూడా సెహ్వాగ్ పేరు కోచ్ ఎంపికలో ప్రస్తావనకు వచ్చింది. అయితే, ఓ జాతీయ క్రికెట్ జట్టుకు కోచ్ గా వ్యవహరించిన అనుభవం లేకపోవడం సెహ్వాగ్ కు ప్రతికూల అంశం.
శ్రీలంకకు చెందిన బ్యాటింగ్ దిగ్గజం మహేల జయవర్ధనే పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ముంబయి ఇండియన్స్ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్న జయవర్ధనేకు అపారమైన క్రికెట్ పరిజ్ఞానం ఉంది. శ్రీలంక తరఫున టన్నుల కొద్దీ పరుగులు సాధించిన అనుభవం జయవర్ధనే సొంతం. అందుకే టీమిండియా కోచ్ ఎంపికలో ఈ లంకేయుడు కూడా బలమైన పోటీదారు అనడంలో సందేహం లేదు.